మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న రోజులు అత్యంత ప్రమాదకరంగా మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత అమాంతం పెరగనుందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 47 నుంచి 48 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణు లు అంచనా వేస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. ఇప్పటికే అక్కడ 44 డిగ్రీల మార్కును దాటేసింది. రానున్న రోజుల్లో ఈ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీచే ప్రమాదం పొంచి ఉంది.

మధ్యాహ్నం 11 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. గాలిలో తేమ తగ్గిపోయి, వేడి గాలులు శరీరానికి తగిలితే చర్మం కాలిపోయేంత తీవ్రత పెరగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో వైద్యు లు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగడం వల్ల కేవలం నీరసం మాత్రమే కాకుండా, ‘సన్ స్ట్రోక్’ (వడదెబ్బ) తగిలే అవకాశం ఉంది, ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. శరీరంలోని నీటి శాతం పడిపోవడం , తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఈ వారం రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.