ఇండీ కూటమికి డీఎంకే గుడ్‌బై చెప్పింది. ఇక కాంగ్రెస్‌డీఎంకే మధ్య పొత్తు ముగిసింది అని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో తమ ఎంపీల సీట్ల కూర్పును మార్చాలని డీఎంకే పార్టీ శుక్రవారం స్పీకర్‌ను కోరింది. కాంగ్రెస్ సభ్యుల పక్కనే తమ ఎంపీలు కొనసాగడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సముచితం కాదని పార్టీ అభిప్రాయపడింది. డీఎంకే నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి తాజాగా లోక్‌సభ స్పీకర్ కు లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా డీఎంకే పార్లమెంటరీ పార్టీ సభ్యులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించేలా తగిన మార్పులు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డీఎంకే ఎంపీలకు సంబంధించిన సీట్ల కూర్పులో తగిన మార్పులు చేయాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాను.కాంగ్రెస్‌తో మా పొత్తు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుత సీట్ల కూర్పులో కాంగ్రెస్ సభ్యుల పక్కనే కొనసాగడం సరైనది కాదని భావిస్తున్నాము అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

అలాగే, లోక్‌సభలో తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు డీఎంకే ఎంపీలకు వేర్వేరు సీట్లు కేటాయించాలని స్పీకర్‌ను కోరారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో టీవీకేకు మద్దతు ప్రకటించడం ద్వారా డీఎంకేతో ఉన్న దీర్ఘకాలిక కూటమికి తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే ముందస్తు పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి. ఈ పరిణామం రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. కాంగ్రెస్ వైఖరిని డీఎంకే సీనియర్ నేతలు వెన్నుపోటు, ద్రోహంగా విమర్శించారు. అయితే డీఎంకే కూడా 2014 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిందని కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది.