పశ్చిమాసియా రణజ్వాలలతో దేశం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుండడంపై ప్రధాని నరేంద్ర మోడీ గత ఆదివారం హైదరాబాద్ బహిరంగ సభలో ప్రజలకు ‘పొదుపు’ పిలుపు ఇచ్చారు. ప్రజలు పెట్రోలు, డీజిల్ ఆదాకోసం ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశీ పర్యటనలు వద్దని, ఎలక్ట్రిక్ వాహనాలనే వాడాలని, బంగారం కొనుగోలు చేయరాదని, ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ పాటించాలని సూచించారు. ఫిబ్రవరి 28నుంచి పశ్చిమాసియా భగ్గుమంటుంటే భారత ప్రధాని మోడీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభ నివారణకు పొదుపు సూచనలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఎప్పుడో తీసుకోవలసిన ఈ జాగ్రత్తలు ఎన్నికలు ముగిసేవరకు ఊరుకుని ఇప్పుడు ఎలుగెత్తి ప్రబోధించడం ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుంది? అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇది తగిన సమయమే అన్న అభిప్రాయం కలుగుతోంది. మొదట్లో ఈ యుద్ధం కొన్నిరోజుల్లో పరిసమాప్తం అవుతుందని అనుకున్నారు. కానీ అటు ఇరాన్, మరోవైపు అమెరికా రెండుకు రెండు దేశాలు మొండికెత్తడంతో ఎప్పటికి యుద్ధం ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఏప్రిల్ 7న కాల్పుల విరమణ కుదిరినప్పటికీ ఆసియా ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేటంతటి సుస్థిర శాంతి ఏర్పడుతుందనే నమ్మకం కలగడం లేదు. హర్మూజ్ జలసంధి దిగ్బంధనం ఒక సంవత్సరం వరకు కొనసాగవచ్చని, ఇంధన సరఫరాయే కాదు, వాణిజ్యరంగం కూడా అస్తవ్యస్తం కావచ్చన్న భయాందోళనలతోపాటు గత ఏప్రిల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా రానున్న ఆర్థిక సంక్షోభాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆర్థిక పరమైన కట్టుబాట్లు మరింత కఠినం చేయాలన్న అభిప్రాయానికి ప్రధాని మోడీ వచ్చినట్టు తెలుస్తోంది. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా యుద్ధప్రభావం మన దేశంపై లేదని మోడీ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.

కానీ ఇప్పుడు శాంతి లేదు, యుద్ధం లేదు, అంతా క్లిష్టపరిస్థితే అని ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటిస్తోంది. ఆలస్యం జరిగినా ప్రజలనుంచి పొదుపును ప్రభుత్వం ఆశిస్తున్నప్పుడు ప్రజల కన్నా ముందుగా ప్రభుత్వమే పొదుపు చర్యలు పాటించి ఆదర్శవంతం కావలసి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీతోపాటు మిగతా పార్టీలు ప్రచారానికి ఎంత ఖర్చు చేశాయో, ఎన్ని వాహనాలను ర్యాలీలకు వినియోగించాయో తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగం అనవసరమైన, ఆడంబరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రధాని, సహచర మంత్రులు పర్యటనకు లగ్జరీ కార్లను వినియోగించడం మానుకోవాలి. అలాగే విదేశీ పర్యటనలు చాలావరకు తగ్గించుకోవాలి. ఇక అధికార యంత్రాంగం విధులకు హాజరు కావడానికి తమ కార్లు, టూవీలర్లు వాడడం మానేసి ప్రజా రవాణా వినియోగించుకోవడం ఆచరణలో సాధ్యమవుతుందా? అలాగే ఆఫీసులకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోం అమలు చేయడం కుదురుతుందా? ఆ మేరకు డిజిటల్ వ్యవస్థ ఆఫీసుల్లో సమగ్రంగా ఉందా? ఉద్యోగులు, ప్రజలు అందరూ బస్సుల్లోను, మెట్రోల్లోను ప్రయాణాలు ప్రారంభిస్తే ఆ ఒత్తిడిని ప్రజా రవాణా వ్యవస్థ తట్టుకోగలుగుతుందా? ఇవన్నీ ప్రశ్నలే.

అయితే సంక్షోభం ఎప్పుడూ ఒక అవకాశమే. ప్రస్తుత చమురు కొరత సంక్షోభంలో ప్రయాణికుల ప్రవర్తనా సరళిని మార్చడానికి, పొదుపుగా ప్రయాణించడానికి ప్రధాని సూచించిన పొదుపు సూత్రం కొంతవరకు సహాయపడుతుందని చెప్పవచ్చు. ఇక బంగారం చాలా తక్కువగా కొనుగోలు చేయాలని ప్రధాని మోడీ సూచించడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. బంగారం దిగుమతిపై ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు. కానీ ఈ విషయంలో సున్నితంగా వ్యవహరించాలే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆందోళనలు తీవ్ర స్థాయిలో తలెత్తే ప్రమాదం ఉందని మోడీ జాగ్రత్తగా ఆలోచించారు. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా బంగారం కొనుగోలులో తమ నియంత్రణ పాటించే అవకాశం కల్పించారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం కొనుగోలు నియంత్రణ ఒక మార్గం. బంగారం విపరీతంగా కొనడం వల్ల జరిగే డాలర్ల ప్రవాహాన్ని అరికట్టి దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడడానికి ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దని ప్రధాని విజ్ఞప్తి చేశారు. 2020 ఏప్రిల్, మే నెలల్లో కరోనా మహమ్మారి తొలిదశలో ప్రధాని మోడీ అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించారు. కానీ పూర్తిగా షట్‌డౌన్ చేయలేకపోయారు. ఒక విధంగా కరోనా నివారణకు కొన్ని నెలలు పట్టింది. ప్రధాని తగిన నివారణ చర్యలు చేపట్టలేకపోయారన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఇప్పుడు కూడా పశ్చిమాసియా సంక్షోభ నివారణకు మోడీ ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. అటు ఇరాన్‌తో కానీ, ఇటు అమెరికాతో కానీ మోడీ ప్రభుత్వానికి తగిన పలుకుబడి లేకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే భారత్‌కు జాతీయ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రపంచ దేశాలతో వాణిజ్య సంబంధాలు పటిష్టమవుతాయి. గల్ఫ్, అరబ్ దేశాల్లో తొమ్మిది మిలియన్ భారత కార్మికులు పనిచేస్తున్నారు. వీరి నుంచి భారత్‌కు దాదాపు 135.4 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రపంచ వేదికపై ప్రధాన దేశంగా పాత్ర వహిస్తున్న భారత్ కేవలం ఆడంబరమైన విశ్వగురువు కాకపోవచ్చు కానీ చట్టబద్ధమైన నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్య దేశంగా తన పాత్ర పోషించవలసిన అవసరం ఉంది.