జహీరాబాద్ బీదర్ రహదారి మరోసారి నెత్తురోడింది. శుభకార్యానికి వెళ్లాల్సిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది. మంగళవారం ఉదయం జహీరాబాద్ బీదర్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కర్ణాటకలోని హుమ్నాబాద్ ఆర్‌టీసీ డిపో బస్సు బీదర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో కర్ణాటక సరిహద్దులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మండల పరిధిలోని మిర్జాపూర్ (బి) గ్రామానికి చెందిన నర్సింలు (49), అరుణ్ (22) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బీదర్ సమీపంలోని కోటె గ్రామంలో జరిగే వివాహ వేడుకలకు హజరయ్యేందుకు బయల్దేరి గమ్యస్థానానికి చేరుతున్న తరుణంలో ప్రమాదం జరిగింది. ప్రమాద దాటికి బస్సు సైతం బోల్తా పడటంతో ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బీదర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కన్నీరు మున్నీరైన కుటుంబ సబ్యులు: ప్రమాదంలో మృత్యువాతకు గురైన వారి కుటుంబసబ్యులు చేసిన ఆర్తనాదాలు చూపరులను కలచివేశాయి. చేతికందిన కొడకు ఒకరైతే, కుటుంబపెద్దగా ఉన్న వ్యక్తి మరొకరు. ఈ ఇద్దరి మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాల వెనుక కేవలం విధి రాతే కాదు, వ్యవస్థల వైఫల్యం కూడా ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. రహదారిపై ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మూల మలుపులు, సరైన సూచికల బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డుకు ఇరువైపులా మట్టి లేకపోవడం కూడా వాహనదారుల పాలిట శాపంగా మారుతున్నది. అధికారులు ఇకనైనా స్పందించాల్సిన అవసరం ఉన్నది. రహదారులు రవాణా సౌకర్యం కోసం ఉండాలి కానీ, ఇలా రక్తపు మడుగులుగా మారకూడదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జహీరాబాద్ బీదర్ రహదారిపై బ్లాక్ స్పాట్లను గుర్తించి తగిన రక్షణచర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.