దాదాపు 60 సంవత్సరాల ద్రవిడ పార్టీల పట్టు నుండి తమిళనాడు రాష్ట్రాన్ని విడిపించిన ఘనత దక్కించుకొని నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టనున్న విజయ్ జోసెఫ్‌కు రాజకీయాలు, సినిమా అంత సులభం కావని గత ఐదు రోజుల్లో బాగా అర్థమయి ఉంటుంది. సినిమాల్లో హీరోలు ఒంటి చేత్తో 100మంది తమకంటే బలవంతులైన గూండాలను, విలన్లను మట్టికరిపించేసి సినీ అభిమానుల చేత విజిల్స్ వేయించుకుంటారు. నిజజీవితంలో అందునా రాజకీయాల్లో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని ఈ నెల 4న ఫలితాలు వెలువడిన దగ్గరి నుండి 9వ తేదీ సాయంత్రం వరకు జరిగిన తతంగం వల్ల బాగా అర్థం అయి ఉంటుంది.

ఆయన వేసిన ఈల (విజయ్ పార్టీ ఎన్నికల గుర్తు ఈల) 108 నియోజకవర్గాల ప్రజలు మాత్రమే వినడంతో అసలు సమస్య వచ్చిపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మొత్తం శాసన సభ్యుల సంఖ్యలో సగానికి మించి ఒక స్థానం అయినా గెలుచుకోవాలి. అంటే 118 స్థానాలు అవసరం. తాను రెండు స్థానాల నుండి పోటీ చేసి గెలిచాడు కాబట్టి ఒకటి వదులుకుంటే 107 స్థానాలే ఉన్నట్టు, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా 11 స్థానాలు అవసరం. ఇండియా కూటమి ధర్మంలో భాగంగా డిఎంకెతో కలిసి పోటీచేసి అయిదు స్థానాలు గెలిచిన కాంగ్రెస్, చెరి రెండు స్థానాలు అదే కూటమిలో భాగస్వాములుగా ఉండి గెలిచిన కమ్యూనిస్ట్‌లు కలిసొచ్చేందుకు అంగీకరించారు. మిగిలిన రెండు స్థానాల కోసం విజయ్‌ని అయిదు రోజులపాటు పార్టీలు మూడు చెరువుల నీళ్ళు తాగించాయి. ఎట్టకేలకు విడుత్తలై చిరుతాయిగల్ కచ్చి (విసికె), ఇండియన్ యూనియన్ అఫ్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) శనివారం సాయంత్రం తమ నలుగురు శాసన సభ్యుల మద్దతు కూడా ప్రకటించడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయింది.ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్ నిర్వహించిన పాత్ర, ఇండియా కూటమి పార్టీలు విజయ్ పార్టీ టివికెకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన పద్ధతి గురించి చర్చించుకోవాలి.


ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ ఎట్లా వ్యవహరించాలి అనే విషయం సర్కారియా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. మొదటిది ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన పార్టీల కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంటే వారిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం, రెండవది అలా కాని పక్షంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఒంటరిగా పోటీ చేసి అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి శాసన సభలో మెజారిటీ నిరూపించుకోవాలని కోరడం. ఇక మూడవది ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితే వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. అయితే ఈ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యలో శాసన సభ్యుల మద్దతు ఉండాలి.

రాజకీయ అనుభవం లేని కారణంగా విజయ్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ అయిదు రోజుల అనిశ్చితి ఏర్పడింది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చూడటానికి జరిగిన ప్రయత్నాలకు మంచి బలం కూడా చేకూరింది. విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించవలసిందిగా కోరి ఉంటే గవర్నర్‌కు మరో మార్గం ఉండేది కాదు. విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించి ఏ పక్షం రోజులో శాసనసభలో బల నిరూపణకు అవకాశం ఇస్తే సరిపోయేది. అట్లా కాకుండా విజయ్ మొదటిసారి గవర్నర్ దగ్గరికి కాంగ్రెస్ మద్దతు కూడా కలుపుకుని వెళ్ళడంతో అది సర్కారియా కమిషన్ నిర్దేశించిన మూడో అంశం కిందకు వచ్చింది. అంటే ఎన్నికల తరువాత ఏర్పడే కూటమి అని అర్థం అప్పుడు స్పష్టమైన మెజారిటీ చూపించాలి. ఆ సాకుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అంగీకరించలేదు.

శాసన సభ్యుల పార్టీ ఫిరాయింపులకు జరిగే బేరసారాలకు అవకాశం ఇచ్చే విధంగా ఇన్ని రోజులు ప్రభుత్వం ఏర్పాటు పైన స్పష్టత రాకపోవడానికి గవర్నర్ కూడా కారకులయ్యారు. చాలా కాలం గవర్నర్లుగా పనిచేసిన కొందరి అభిప్రాయం ప్రకారం గవర్నర్ రూల్ బుక్ మాత్రమే పట్టుకు వేళ్ళాడకుండా ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు కొంచెం పట్టువిడుపులతో వ్యవహరించాలి. అయితే గవర్నర్లు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఇవ్వాళ దేశంలో ఎక్కడున్నాయి. విజయ్ సరే, రాజకీయానుభవం లేని వాడు. శతాబ్దం పైబడిన రాజకీయానుభవం కలిగిన కాంగ్రెస్ ఎందుకు తొందరపడింది? వందేళ్ళ అనుభవంతో తలపండిన కమ్యూనిస్టులు ఆ మరునాడు ఎందుకు తొందరపడ్డారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గవర్నర్ ఆహ్వానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తమ మద్దతు ప్రకటించి ఉండాల్సింది.

కాంగ్రెస్, కమ్యూనిస్టులు అట్లా తొందరపడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఇటీవలే బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎలో చేరిన ఎఐఎడిఎంకెను అధికారంలోకి తీసుకురావడానికి స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె కూడా సిద్ధపడిందన్న వార్త. కరుణానిధి, జయలలిత జీవించి ఉన్న కాలంలో ఈ రెండు ద్రవిడ పార్టీల మధ్య శత్రుత్వం ఎంత తీవ్రంగా ఉండేదో తెలుసు. మహిళ అని కూడా చూడకుండా శాసనసభలో జయలలితను అవమానించడం, అట్లాగే అత్యంత సీనియర్ నాయకుడు, వృద్ధుడు అని చూడకుండా అర్ధరాత్రి కరుణానిధిని ఇంట్లోంచి పోలీసులు లాక్కుపోవడం వంటి సంఘటనలు ఆ రెండు పార్టీల మధ్యన ఉన్న శత్రుత్వానికి ఉదాహరణలుగా ఇప్పటికీ చెప్పుకుంటారు. అటువంటిది మరి ద్రవిడ పార్టీల చేతుల్లో నుండి అధికారం పోకూడదన్న కోరికతోనో, మరింకే కారణం చేతనో డిఎంకె అధిపతి స్టాలిన్ ఎఐఎడిఎంకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వెలుపలి నుండి మద్దతు ఇద్దాం, విజయ్‌ని నిలువరిద్దాం అనే ప్రతిపాదనతో ముందుకు రావడం కారణంగా కాంగ్రెస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయ్‌కి మద్దతు తెలిపింది. ఇది ప్రచారం మాత్రమే కాదు, సిపిఐ(ఎం) జాతీయ కార్యదర్శి బేబీ స్వయంగా స్టాలిన్ ఈ ప్రతిపాదన తెచ్చినట్టు ఒక జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇంత చేస్తే కాంగ్రెస్ పార్టీ కూటమి ధర్మం పాటించలేదు అని డిఎంకె ఇండియా కూటమి నుంచి తాను తొలగిపోతున్నట్టు లోకసభ స్పీకర్‌కు అప్పుడే అధికారిక లేక కూడా పంపించింది. బయట మాత్రం విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము అడ్డురామని ఆరునెలల పాటు ఆయన పరిపాలనను గమనిస్తామని ప్రకటించిన స్టాలిన్ రాజకీయంగా తనకు బద్ధశత్రువు అయిన బిజెపితో కలిసి పోటీచేసిన ఎఐఎడిఎంకె ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సమర్థించాలని ఎందుకు అనుకున్నారో ముందు ముందు తెలియాలి. విజయ్ సిద్ధాంతపరంగా తను బిజెపికి వ్యతిరేకినని ప్రకటించి ఉన్న కారణంగా, దాదాపు 60 సంవత్సరాల తరువాత తమిళనాడులో ప్రభుత్వం లో భాగస్వాములు అయ్యే అవకాశం లభిస్తున్న కారణంగా కాంగ్రెస్ టివికె కు సమర్థన ఇవ్వడం అర్థం చేసుకోవచ్చు. అయితే జాతీయ స్థాయిలో మరింత బలపడుతున్న బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న డిఎంకె తొలగిపోతే జరిగే నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆలోచించుకోవాల్సిందే. 22 మంది ఎంపిలతో లోకసభలో డిఎంకె ఇండియా కూటమికి బలమైన మిత్రుడిగా ఉంటూ వచ్చింది ఇంతకాలం. ఇప్పటికే బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీలు ఇండియా కూటమితో అంటీముట్టనట్టుగానే ఉంటున్నాయి.

ప్రస్తుతానికి అయితే విజయ్ గట్టెక్కినట్టే. శనివారం సాయంత్రం ఆయన గవర్నర్‌ను కలిసి తనకు మద్దతుగా ఉన్న 122 మంది శాసన సభ్యుల జాబితాను సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అయితే అందుకోసం ఈ అయిదు రోజులు జరిగిన తతంగం అంతా చూస్తే విజయ్‌కి ముందున్నది ముళ్ళబాటే అని అర్థం అవుతున్నది. ప్రభుత్వం ఏర్పాటు దశలోనే ముప్పుతిప్పలు పెట్టిన పార్టీలు రేపు మాటిమాటికీ అలగడం, బెదిరించడం చేస్తే?..శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మభూమి పశ్చిమబెంగాల్‌లో మొదటి సారి అదీ మమతా బెనర్జీని ఓడించి అధికారంలోకి వచ్చామన్న ఊపులో ఉన్న బిజెపి దక్షిణాది అంతటా కమలాలు పూయించాలని కలలుకంటోంది. ఈ నేపథ్యంలో బిజెపి స్పష్టమైన మెజారిటీ రాకుండా ఇతర పార్టీల సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్‌ని నిశ్చింతగా పరిపాలన చేసుకోనిస్తుందా? అన్నది సందేహమే. తమిళనాడు మాదంటే మాది అనుకునే డిఎంకె 59, స్థానాలు ఎఐఎడిఎంకె 47 స్థానాలకు పరిమితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో మామూలుగా అయితే ఏం జరగాలి రెండు ద్రవిడ పార్టీలు ప్రస్తుతం విజయ్ తమకు మించిన ప్రజాదరణ కలిగిన నాయకుడు అని వినమ్రంగా అంగీకరించి ఆయనకు అధికారాన్ని అప్పజెప్పి పక్కకు జరగాలి. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న అనుభవంతో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అనిశ్చితి వల్ల రాష్ట్రానికే నష్టం.