
రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావుడి చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు. దూపైనప్పుడే బాయి తవ్వినట్లు కాకుండా ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలి కానీ, అది వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులివ్వడం కాంగ్రెస్ కురచబుద్ధిని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నదన్నారు. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. నిజంగానే ఒప్పందం ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఏడున్నరేండ్లు అధికారంలో ఉండి కూడా తట్టెడు మట్టైనా ఎందుకు తవ్వలేదని ప్రశ్నించారు.
30 నెలలుగా కాంగ్రెస్ పార్టీని ఎవరాపారు? ఆ రోజు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి లేఖ రాశారు. మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారని, మీరే పనిచేసినా అది వృథా అవుతుందని స్పష్టంగా చెప్పినా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అగ్రిమెంట్ అయిపోయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అగ్రిమెంటై ఉంటే తమ్మిడిహట్టి దగ్గర పనులు ప్రారంభించకుండా.. తోక పనులను ఎందుకు ప్రారంభించారు? చేవెళ్ల దగ్గర ఎందుకు తవ్వారని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయనే కనీస అవగాహన లేకుండా మంత్రి జూపల్లి కృష్ణారావు తన అవివేకాన్ని బయటపెట్టుకున్నాడన్నారు. హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కట్టి సుందిళ్ల బ్యారేజీకి నీళ్లు తెస్తామంటే సీఎం రేవంతేమో తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్టుతో నీళ్లు తెస్తామంటాడు. మంత్రి జూపల్లేమో లిఫ్ట్ అవసరం లేదు, గ్రావిటీ ద్వారా వస్తాయంటాడు. వీళ్ల అజ్ఞానపు మాటలతో రాష్ట్ర పరువు పోతున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వారితో చర్చించి,
మెప్పించి మన ప్రయోజనాలు కాపాడుకోవాలి కానీ, రేవంత్ రెచ్చగొట్టే తీరుతో కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కేసీఆర్ నాయకత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా నేను, అధికారులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎంను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. కేసీఆర్ తన పుట్టినరోజు నాడే రాష్ట్ర ప్రయోజనాల కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమై తుమ్మిడిహట్టి వద్ద ఎకో సెన్సిటివ్ జోన్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉందని, సుప్రీం తీర్పు రావాలన్నారు. ఈ సాదక బాధకాలు తీర్చకుండా.. మ్యానిఫెస్టోలో పెట్టి డైలాగులు కొట్టడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రవేశపెట్టిన నిధులతో ప్రాజెక్టు పూర్తవుతుందా అని ప్రశ్నించారు. ఆనాడు ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఏపీలో మూడుచోట్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాణహిత చేవెళ్లను కట్టకుండా సమయం వృథా చేశారు. నాలుగేళ్లలో పూర్తిచేస్తామని మాట ఇచ్చి రెండున్నరేండ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఎద్దేవా చేశారు. కనీస సర్వే లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.2,300 కోట్లు బిల్లులు లేపారని, అవినీతి అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల పనులకు, భూసేకరణకు ఖర్చుచేసింది రూ.3,780 కోట్లు. కానీ, నిన్న రేవంత్ రూ.11 వేల కోట్లు పూర్తయ్యాయని పచ్చి అబద్ధం చెప్పారన్నారు. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖలోని అన్ని విభాగాలు చెప్పాయన్నారు. ఆనాటి కేంద్రమంత్రి ఉమాభారతి రాసిన లేఖలో మూడో పేజీలో ఉన్న నీళ్లు లేవు అన్న విషయాన్ని దాచిపెట్టి, సగం లేఖను మాత్రమే చూపిస్తూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఒక్కో పార్టీలో ఒక్కో మాట మాట్లాడటం సీఎం రేవంత్ నైజమని, ప్రాణహిత చేవెళ్లకు వైఎస్ శంకుస్థాపన చేస్తే.. అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని విమర్శించిన రేవంత్ రెడ్డి, నేడు అదే ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడన్నారు. ఈ మండుటెండల్లో ఈ నిమిషానికి మేడిగడ్డ వద్ద 6400 క్యూసెక్కుల నీళ్లు కిందకి వెళ్ళిపోతున్నాయి కానీ, తుమ్మిడిహట్టి వద్ద కేవలం 2000 క్యూసెక్కులు మాత్రమే పోతున్నాయని, మేడిగడ్డ వద్ద 500 బోర్లు వేయాల్సి ఉంటే మీరు కనీసం 5 బోర్లు కూడా వేయలేదన్నారు. ఆ రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనన్న అక్కసుతోనే పనులు ఆపుతున్నారన్నారు.
వచ్చే ఏడాది ఎల్‌నినో వల్ల దేశమంతా కరువు వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. కటిక చీకట్లో కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత కరువొచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే స్థలం మేడిగడ్డ అని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ తాగు, సాగునీటి అవసరాల కోసం ఇంజినీర్లతో చర్చించి ఈ ప్రాజెక్టు కట్టారని, కాళేశ్వరాన్ని తక్కువ చేసి మాట్లాడితే, అది కేసీఆర్‌ను తక్కువ చేసినట్లు కాదు., తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ జాతికి మీరు చేస్తున్న ద్రోహమన్నారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేయకండి. కాళేశ్వరాన్ని కించపరిస్తే అందులో కొలువైన ముక్తేశ్వరుడే మిమ్మల్ని కచ్చితంగా శిక్షిస్తాడు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తుమ్మిడిహట్టి జలహారతుల డ్రామాలు కట్టిపెట్టి, వెంటనే మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయాలని సూచించారు. రాష్ట్ర రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, బీఆర్ఎస్ నాయకులు పూజల వెంకటేశ్వర్లు (చిన్న), రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.














