
హైదరాబాద్: ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ సర్కారు హత్యనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని అందుకే శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ పరిరక్షణ, తోటి కార్మికుల హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం చేశారని, నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనీయపోవడం దుర్మార్గం అని కెటిఆర్ విమర్శించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి బిఆర్ఎస్ నేతలు అండగా నిలిచారని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కార్మికుల అరెస్టు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమంగా అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, శంకర్ గౌడ్ కు ఆర్టిసి డిపో దగ్గర నివాళులర్పించేందుకు అవకాశం ఇవ్వాలి అని కోరారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సవాలక్ష హామీలు ఇచ్చారని, రేవంత్ రెడ్డి కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదని.. అందుకే ఆర్టిసి కార్మికులు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని ధ్వజమెత్తారు. ఆర్టిసిని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని, కార్మికులతో చర్చించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.



