న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల కౌంటింగ్ సిబ్బందిగా కేంద్ర ఉద్యోగుల తరలింపు విషయంలో ఆదేశాలకు సుప్రీంకోర్టు శనివారం నిరాకరించింది. ఎన్నికల సంఘం ఇటీవలి సర్కులర్‌ను సమర్ధించింది. కౌంటింగ్‌కు కేంద్ర ఉద్యోగాల తరలింపును సవాలు చేస్తూ బెంగాల్‌లోని అధికార పక్షం టిఎంసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 4వ తేదీనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కేంద్ర ఉద్యోగులను విధులలో ఉంచడం వల్ల అధికార బిజెపికి మేలు జరిగే అవకాశం ఉందని, వెంటనే వారిని అక్కడి నుంచి తప్పించాలని టిఎంసి కోరింది.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయం పూర్తిగా ఎన్నికల సంఘం విధులు , బాద్యతల పరిధిలోకి వస్తుందని , ఇది చట్టం నిబంధనలకు విరుద్ధం ఏమీ కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల విధులతో పాటు కౌంటింగ్ ప్రక్రియ దశలో కూడాకేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలతో కూడిన బృందాలు ఉంటాయని ఎన్నికల సంఘం ఈ నెల 13న సర్కులర్ వెలువరించింది. ఇది పూర్తిగా చట్టబద్ధం అని సుప్రీంకోర్టు సమర్థించింది.