
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రి పాలనతో రాష్ట్రాభివృద్ధి యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. పిసిసి కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటైన సమర్థ శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటైన ఈ శిక్షణా శిబిరం వచ్చే నెల 2వ తేదీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సహా పలువురు నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ.. బిఆర్‌ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలన అంతా అవినీతిమయం, దోచుకున్న వారంతా ఇప్పుడు కెసిఆర్ పక్కన పందికొక్కుల్లా ఉన్నారంటూ టిఆర్‌ఎస్ (సేన) వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలకు కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను ఆదరించే పరిస్థితి లేదన్నారు. కుటుంబ పంచాయితీతో కెసిఆర్ సతమతమవుతున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోకుండా పదవుల గురించి పాకులాడారని ఆయన తెలిపారు.
బిఆర్‌ఎస్ నేతలకు చెప్పుకోవడానికి గతమే తప్ప భవిష్యత్తు లేదని ఆయన అన్నారు. దేశ స్వాతంత్య్ర సమరం నుంచి ఆరంభమైన సేవాదళ్ సేవలు చిరస్మరణీయమని ఆయన తెలిపారు. కేంద్రంలో అవలంబిస్తున్న ధోరణిని సేవాదళ్ ఎండగడుతున్నదని ఆయన తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసిన ఘనత ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీకి దక్కుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.













