మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అందించిన సాయం, నేడు ఆ బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. కెటిఆర్ సాయంతో బ్రెయిన్ ట్యూమర్ జయించిన బాలిక ఇటీవల విడుదలైన పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. 2019లో ప్యారడైజ్ బాలంరాయ్‌కు చెందిన కె. నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య బ్రెయిన్ ట్యూమర్ బారిన పడగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు లేకపోవడంతో బసవతారకం ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకక వారు వారం రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ క్లిష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ పూజిత, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి, తన బృందాన్ని రంగంలోకి దింపారు. ట్వీట్ చేసిన అరగంటలోనే రిప్లై రావడమే కాకుండా, మరుసటి రోజు ఆదివారం (సెలవు దినం) అయినప్పటికీ, కెటిఆర్ ఆదేశాలతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కెటిఆర్ చొరవతో శరణ్యకు అత్యంత ఖరీదైన వైద్యం పూర్తి ఉచితంగా చికిత్స లభించింది. చిన్నారి శరణ్యకు స్టంట్ వేయడంతో పాటు మేజర్ సర్జరీ నిర్వహించారు.

సుమారు రూ. 3 లక్షలు ఖరీదైన రేడియేషన్ థెరపీని కూడా కెటిఆర్ స్వయంగా పర్యవేక్షించి ఉచితంగా చేయించారు. సర్జరీ నుంచి డిశ్చార్జ్ వరకు ఎంఆర్‌ఐ సహా ప్రతి వైద్య పరీక్ష ఖర్చులను కెటిఆర్ బృందమే భరించింది.తాము ఒక్క రూపాయి కూడా ఆసుపత్రిలో ఖర్చు పెట్టలేదని చిన్నారి తల్లి రాజేశ్వరి భావోద్వేగంతో తెలిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన శరణ్య, ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 384 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. తన ప్రాణాలు కాపాడిన కెటిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపాలన్న శరణ్య కోరిక మేర ఆదివారం ఆ కుటుంబం కెటిఆర్‌ను నంది నగర్ నివాసంలో కలిసింది. తమ బిడ్డను ఆరోగ్యవంతురాలిని చేయడమే కాకుండా, ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చదువులో రాణించేలా ప్రోత్సహించిన కెటిఆర్‌కు శరణ్య తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి శరణ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కెటిఆర్ ఆకాంక్షించారు.

కొన్ని సంఘటనలు చాలా సంతృప్తినిస్తాయి : ఎక్స్‌లో కెటిఆర్

రాజకీయ ప్రస్థానంలో కొన్ని సంఘటనలు చాలా సంతృప్తినిస్తాయని కెటిఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవడానికి ఉపయోగించే సదవకాశం నాకెన్నోసార్లు దక్కిందని అన్నారు. 2020లో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న శరణ్య అనే చిన్నారి చికిత్స కోసం సహాయాన్ని అందించానని, శరణ్య ఇటీవలే పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, తనను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆ బాలిక భావోద్వేగం చూసి నా కళ్ళు చెమర్చాయని వ్యాఖ్యానించారు. శరణ్య ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం సంతోషకరం అని, గాడ్ బ్లెస్ యూ శరణ్య అంటూ ట్వీట్ చేశారు.