
హైదరాబాద్: పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ బిడ్డ తెలంగాణకు సిఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. కొడంగల్ లో సిఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొడంగల్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ. 110 కోట్లు, రూ.255 కోట్లతో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీవెంకటేశ్వర స్వామి బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజు 18 గంటలు కష్టపడుతున్నా..ఇంకా సమస్యలున్నాయని, కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాన తీసుకెళ్లామని తెలియజేశారు.
కొడంగల్ అభివృద్ధి కోసం అంతా కలిసి వస్తున్నారని, కొడంగల్ లో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలని సూచించారు. వికారాబాద్- కృష్ణా రైల్వే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, రాష్ట్రంలో నలుమూలల నుంచి మంచి చదువు కోసం విద్యార్థులు కొడంగల్ కు వస్తున్నారని అన్నారు. కోస్టి నుంచి ఎయిర్ పోర్టు వరకు 300 ఫీట్ల రోడ్ వస్తుందని, కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని రేవంత్ పేర్కొన్నారు. కొడంగల్ లో రాజకీయాలు పక్కన పెట్టాలని.. అభివృద్ధి కోసం అందరూ పనిచేయాలని, దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రెండేళ్లలో కొడంగల్ కు వస్తున్నాయని అన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తైయిందని, కొడంగల్ కృష్ణా జలాలు వచ్చే వరకు మంత్రి దామోదర, శ్రీహరిని నిద్రపోనీయొద్దు అని రేవంత్ రెడ్డి ఆదేశించారు.














