లక్నో: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యుపి మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. బుధవారం ఉదయం ప్రతీక్ అపస్మారక స్థితిలో వెళ్లడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ప్రతీక్ కొన్ని సంవత్సరాల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందిపడుతుండడంతో చికిత్స తీసుకున్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన శరీరంపై గాయాలు లేవని ప్రాథమిక నివేదికలో తెలిసింది. తన సోదరుడు మృతిపట్ల యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, రాజకీయ ప్రముఖులు, తదితరలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసు నుంచే ఆయన ఆరోగ్యం ఎంతో శ్రద్ధ వహించేవారని అఖిలేష్ గుర్తు చేశారు. రెండు నెలల క్రితం ప్రతీక్ ను కలిసినప్పుడు రాజకీయాలతో వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు. మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ కు సవతి తల్లి సోదరుడు ప్రతీక్. 2011లో అపర్ణను ప్రతీక్ వివాహం చేసుకున్నాడు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ తరపున అపర్ణ పోటీ చేసి ఓడిపోయారు. 2022 యుపి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తరపున అపర్ణ ప్రచారం చేశారు. దంపతుల మనస్పర్థలు రావడంతో తన కుటుంబాన్ని అపర్ణ విడదీస్తుందని ప్రతీక్ తీవ్ర ఆరోపణలు చేశాడు. తమ బంధాన్ని వీలైనంత త్వరంగా ముగింపు పలుకుతామని సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే.