హైదరాబాద్: ఎటిఎంలోకి వెళ్లిన వ్యక్తి ఊపిరాడక మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లెపల్లిలోని ఓ హెచ్‌డిఎఫ్‌సి ఎటిఎం సెంటర్‌లోకి ఓ వ్యక్తి డబ్బులు డ్రా తీయడానికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన తరువాత ఎటిఎం సెంటర్ డోర్ లాక్ కావడంతో అందులోనే ఉండిపోయాడు. బయట నుంచి గాలి వచ్చే అవకాశం లేకపోవడంతో ఊపిరాడక అతడు మృతి చెందాడు. స్థానికులు గమనించి బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఊపిరాడక చనిపోయి ఉంటాడని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. హార్ట్ ఎటాక్ తో చనిపోయాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిసి కెమెరాను పరిశీలిస్తే అన్ని తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.