
మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన చేవెళ్ల -ప్రాణహిత వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికిగాను తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలబెట్టిన బ్యారేజ్ నిర్మాణనికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్‌ను ఆయన ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపనున్న నేపథ్యంలో ఉభయరాష్ట్రలకు అనువైన పద్ధతిలో ఉండేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించడంతో పాటు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలు అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్‌సి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక వివరాలతో కూడిన
పూర్తిస్థాయిలో నివేదికను..
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రలోని భూభాగంతో పాటు చప్రాల వన్యప్రాణుల అభయారణ్యంలో ముంపు ప్రభావం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలకు అవసరమైతే నష్ట పరిహారాన్ని చెల్లించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ తక్కువ వ్యయంతో వరద నీటి ప్రవాహాన్ని వినియోగించేలా నిర్మాణం చేపట్టేలా మార్గాలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆయన ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి అంతర్ రాష్ట్ర చర్చలకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలు, సాధ్యాసాధ్యాలు, ఖర్చు చేసే మొత్తంతో ఓనగూరే ప్రయోజనాలతో పాటు భూగర్బానికి సంబంధించిన సాంకేతిక వివరాలతో పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఉత్తర తెలంగాణ
జిల్లాకు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూపుదిద్దుకున్న చేవెళ్ల -ప్రాణహిత ప్రాజెక్టును గోదావరి ఉపనది ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి వరద కాలువలతో సాగునీరు సరఫరా చేయడంతో పాటు అవసరమైన చోట ఎత్తిపోతల పథకాలు నిర్మించి ఎగువ ప్రాంతాలకు మళ్లీంచేలా ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆ యన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీని ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఎల్లంపల్లి జలాశయాలతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతాల వరకు సాగునీరు అం దించాలన్న లక్ష్యంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రా జెక్టును రూపొందించిందన్నారు. తక్కువ వ్యయంతో ఉత్తర తెలంగాణ జిల్లాకు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపు ది ద్దుకుందన్నారు. అయితే 2014లో తెలంగాణ ఏర్పడ డం అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం రీ డిజైన్‌ల పేరుతో అకారణంగా కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లు నిర్మించినా ఆశించిన ప్ర యోజనం చేకూరలేదన్నారు. ప్రాజెక్టు పరిధి విస్తరించి నప్పటికీ ఎత్తిపోతలపై ఆధారపడడంతో విద్యుత్ చార్జీ లు పెనుభారంగా పరిణమించిడంతో పాటు భారీ వ్య యంతో నిర్మించిన ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయ ట పడడంతో వరద కాలువల ద్వారా లభించే ప్రయోజనాలు నెరవేరక పోగా రంగారెడ్డి జిల్లా చివరి ప్రాంతాలకు ఎంత మాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు.
నాలుగు ప్రత్యామ్నాయ
అలైన్‌మెంట్ ప్రతిపాదనలను
చేవెళ్ల -ప్రాణహిత పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యే ప్రసక్తే లేదన్నారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.11,000 కోట్లు ఖర్చు పెట్టి 71.5 కిలో మీటర్లు దూరం కాలువ తవ్వకాలు హెడ్ వర్క్ నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైన మేర వినియోగించుకుంటూ తక్కువ వ్య యంతో ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు దృష్టి కేంద్రీకరించామన్నారు. తు మ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి, అక్కడి నుంచి సుందిళ్ల వరకు అనుసంధానానికి నాలుగు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్ ప్రతిపాదనలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నిపుణులు, ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి పరిశీలిస్తున్నామన్నారు. భూసేకరణ తగ్గించడం, పంపింగ్ అవసరాన్ని తగ్గించడం, టన్నెళ్లు, కాలువల పొడవు తగ్గించడం, మొత్తం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడం ఈ అధ్యయనాల ప్రధాన లక్ష్యంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
తుమ్మిడిహట్టి ప్రాంతంలో భూగర్భ, భౌగోళిక సర్వేలు కూడా వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వర్షాకాలానికి ముందే అత్యవసర మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. ఈ పనులు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సాంకేతిక మార్గదర్శకత్వంలో కొనసాగనున్నాయని ఆయన తెలిపారు. ఈ మరమ్మతుల కోసం ప్రతి 1.5 మీటర్లకు ఒకసారి స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్, ప్రతి 3 మీటర్లకు ఒకసారి పర్మియబిలిటీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాతి పొర తగిలిన తర్వాత కూడా మరింత లోతుగా డ్రిల్లింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. ఇందుకోసం సమన్వయ కమిటీ వెంటనే ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించి, పనులకు స్పష్టమైన కాలపట్టిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భారీ ఎత్తిపోతల ఆధారిత విధానంతో పోలిస్తే తక్కువ నిర్వహణ వ్యయంతో విశ్వసనీయంగా సాగునీరు అందించే అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.













