అమరావతి: మహిళపై సిఐ అత్యాచారం చేసిన కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సిఐ మల్లయ్య పరారీలో ఉన్న సంఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రాహ్మణపల్లిలో చిలకలూరిపేట సిఐ మల్లయ్య తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి చిలకలూరి పేటలో న్యాయమూర్తి ముందు ఆమెను హాజరుపరిచి వాంగ్మూలాన్నీ తీసుకున్నారు. సిఐ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి బ్రాహ్మణపల్లికి విచారణకు వెళ్తుండగా సిఐ మల్లయ్య గ్రామం నుంచి పారిపోయాడు. బ్రాహ్మణపల్లి గ్రామంలో పలువురు మహిళలను సిఐ వేధించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. సిఐ మల్లయ్య తనని లైంగికంగా వేధించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపణలు చేసింది. మరో మహిళ వైపు కన్నెత్తి చూడకుండా అతడిని కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. సదరు సిఐకి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకొని పలువురు మహిళలపై సిఐ అత్యాచారం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పరువుపోతుందని బయటకు చెప్పుకోవడంలేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.