హైదరాబాద్: దేశ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సరైనా జెండా లేకపోవడంతోనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చులకనవుతోందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి డిఎంకెతో కాంగ్రెస్ మంచి సంబంధాలు ఉన్నాయని, డిఎంకె పార్టీతో పొత్తుతోనే అనేక సంక్షోభాల నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడిందన్నారు. స్టాలిన్ పార్టీని వదిలి కాంగ్రెస్ టివికెతో చేతులు కలిపిందని విమర్శలు గుప్పించారు. అధికారంపై దురాశతో స్టాలిన్‌కు వెన్నుపోటు పొడించిందని, రాజకీయంగా తన ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎంత దారుణానికైన ఒడిగడుతుందని విమర్శలు గుప్పించారు. కర్నాటకలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరాటాలతో సుపరిపాలన అందించడం లేదని, గత మూడు సంవత్సరాల నుంచి కర్నాటక ప్రజలు సమస్యలు పరిష్కరించకుండానే అంతర్గత కలహాలను పరిష్కరించుకుంటున్నారని చురకలంటించారు. కర్నాటక ముఖ్యమంత్రి ఎంత కాలంలో కొనసాగుతారో చెప్పలేకపోతున్నారన్నారు. కర్నాటకలో సరైన పాలన లేకపోవడంతో ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బిజెపి ఘన విజయం సాధించిందని, భవిష్యత్‌లో కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు.