
మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి ఆధారిత హింస ఇక అప్పుడప్పుడు చెలరేగే సంక్షోభం కాదు; సులభంగా అదుపు చేయలేని స్థిరమైన ధోరణిగా మారింది. దీన్ని లక్ష్యంగా చేసుకుని హత్యలు, పేలుళ్లు, వదంతులతో చెలరేగే ఘర్షణలు.. ఏ కొత్త ఘటన జరిగినా, ఆగ్రహం, సమీకరణ, ప్రతీకార దాడులుగా మారే పాత చక్రంలోనే కలిసిపోతున్నాయి. ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం హింస పునరావృతం కావడం మాత్రమే కాదు; అది క్రమంగా సాధారణంగా మారిపోవడం. రాజకీయ నాయకత్వ మార్పులు జరిగినా, కేంద్ర జోక్యం జరిగినా పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు. ఇది సమస్య మరింత లోతుగా ఉన్నదని సూచిస్తోంది. దీర్ఘకాలిక, సృజనాత్మక, నిష్పాక్షిక చర్యలు అవసరమైన ఈ ఘర్షణను ఎదుర్కోవడంలో రాజకీయ సంకల్పానికి పరిమితులు ఉన్నాయని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
జాతి ఘర్షణలు ఏ ప్రభుత్వానికైనా అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటి. వీటికి ఒక్క కారణం ఉండదు; చారిత్రక అసంతృప్తులు, గుర్తింపు రాజకీయాలు, సంవత్సరాలుగా పేరుకుపోయిన అనుమానాలు కలిసి ఈ సమస్యలను కొనసాగిస్తాయి. మణిపూర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి ఘటనను వెంటనే జాతి కోణంలోనే చూడడం అక్కడ సాధారణమైపోయింది. నిజాల కంటే పరస్పర విరుద్ధ కథనాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఎంపిక చేసిన సమాచారం, వేగంగా వ్యాపిస్తున్న తప్పుడు ప్రచారం ఈ విభేదాలను మరింత పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిప్రాయాలే వాస్తవాల మాదిరిగా మారిపోతాయి; వాస్తవాలు మరింత ప్రమాదకరంగా మారుతాయి. ఇటీవల చిన్నారుల ప్రాణాలు తీసిన బాంబు పేలుడు ఘటన తర్వాత మళ్లీ హింస చెలరేగడం వంటివి చూస్తే.. పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందన్న ఆరోపణలు, వాటిపై ఖండనలు, పరస్పర ఆరోపణలు ఆందోళనలకు దారి తీశాయి. ఆ నిరసనలు త్వరలోనే కొత్త ఘర్షణలకు దారితీశాయి.
ఇప్పుడు ఇది మణిపూర్‌లో సాధారణంగా కనిపిస్తున్న నమూనాగా మారింది. చిన్న ఘటన కూడా పెద్ద అల్లర్లకు దారితీస్తోంది. ఎందుకంటే అనుమానాలు, భయాలు ఇప్పటికే సమాజంలో బలంగా వేళ్లూనుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించినా, అది ముందస్తు చర్య కంటే సంఘటన తర్వాత తీసుకునే చర్యగానే కనిపిస్తోంది. ఈ భావన ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. తమ భద్రతను తామే చూసుకోవాలనే భావన సమాజంలో పెరుగుతోంది. ఫలితంగా ఆయుధీకరణ, ప్రతీకార ధోరణి మరింత బలపడుతూ హింసా చక్రం కొనసాగుతోంది. రాజకీయ మార్పులతో మణిపూర్‌లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడుతుందన్న అంచనాలు అతిగా ఆశావహంగా మారాయి. ముఖ్యమంత్రి మార్పు, రాష్ట్రపతి పాలన అమలు వంటి చర్యలు పాలనలో కొత్త దిశకు నాంది పలుకుతాయని, శాంతిపట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుతాయని భావించారు.
అయితే హింస కొనసాగుతుండటం చూస్తే, ఈ చర్యలు ఎక్కువగా విధానపరమైనవే గానీ, మూల సమస్యలను తాకేలా లేవన్న అభిప్రాయం బలపడుతోంది. పాలనా వ్యవస్థలో మార్పులు మాత్రమే సమగ్ర రాజకీయ వ్యూహానికి ప్రత్యామ్నాయం కావు. ఘర్షణల మూల కారణాలను పరిష్కరించేందుకు నిరంతర ప్రయత్నాలు లేకపోతే, ఇటువంటి మార్పులు ప్రజలకు కేవలం ప్రతీకాత్మక చర్యల్లాగానే కనిపించే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది రాజకీయ స్థాయిలో దీర్ఘకాలిక చొరవల లోపం. తీవ్ర విభజనలతో ఉన్న సమాజంలో శాంతి సహజంగా ఏర్పడదు. సంభాషణలు, చర్చలు, పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యల ద్వారా దాన్ని నిర్మించాలి. కానీ మణిపూర్‌లో అలాంటి రాజకీయ చర్చలకు అవకాశాలు క్రమంగా క్షీణిస్తున్నాయి.
సమాజాల మధ్య వారధిగా నిలవగల మితవాద స్వరాలు క్రమంగా అణచివేయబడుతున్నాయి. మరోవైపు కఠిన వైఖరులే ప్రజా చర్చల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మధ్యవర్తిత్వం చేయగల పౌరసంఘాలకు అవసరమైన సంస్థాగత మద్దతు, రాజకీయ సహకారం సరిపడా లభించడం లేదు. విశ్వసనీయమైన రాజకీయ ప్రక్రియ లేకపోవడంతో, హింస కేవలం పరిణామంగా కాకుండా కొందరికి తమ ప్రాధాన్యతను చాటుకునే సాధనంగా మారుతోంది. ఇంకా ఆందోళన కలిగించే అంశం రాజకీయ ప్రాధాన్యతలపై ఏర్పడిన అభిప్రాయం. ఘర్షణ పరిష్కారం కంటే ఎన్నికల లెక్కలు, రాజకీయ లాభనష్టాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది మణిపూర్‌లో ఆలస్యమైన స్పందనలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు, రాష్ట్ర ప్రభుత్వం- కేంద్రం మధ్య సమన్వయ లోపంగా బయటపడుతోంది. ఇలాంటి అసంగతలు వదంతులకు అవకాశమిస్తాయి. ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయి. శాంతి కోసం స్పష్టమైన, పారదర్శకమైన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం వల్ల భిన్న కథనాలు బలపడుతూ, ఇప్పటికే ఉన్న విభేదాలను మరింతగా ముద్ర వేస్తున్నాయి.
మణిపూర్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కోసం కఠినత్వం, సమగ్రత కలిసిన ద్వంద్వ విధానం అవసరం. ఒకవైపు ప్రభుత్వం చట్టం అమలులో నిష్పాక్షికత, పారదర్శకతను ప్రదర్శిస్తూ తన అధికారాన్ని పునరుద్ధరించాలి. సంఘటిత గుంపులు చేసినా, వ్యక్తులు చేసినా హింసాత్మక చర్యలపై ఎలాంటి పక్షపాతం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంపిక చేసిన చర్యలు మాత్రమే తీసుకుంటున్నారనే భావన ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అంతేకాదు, సమాజంలో అసంతృప్తిని మరింత పెంచుతుంది. మరోవైపు సామరస్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సమాంతర రాజకీయ ప్రక్రియ కూడా అత్యంత అవసరం. ఇది కేవలం ప్రతీకాత్మక చర్చలకే పరిమితం కాకూడదు. సమాజ నాయకులు, పౌరసంఘాల ప్రతినిధులు, అవసరమైతే విభేదాల మధ్య వారధిగా నిలవగల నమ్మకమైన మధ్యవర్తులతో కూడిన వ్యవస్థీకృత సంభాషణలు జరగాలి.
సమాచార వ్యవస్థ అవసరం!
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర అత్యంత కీలకంగా మారుతోంది. ఇంత పెద్ద, సున్నితమైన ఘర్షణల విషయంలో కేవలం పర్యవేక్షణ సరిపోదు. రాజకీయ చొరవ, పరిపాలనా సమన్వయం కలిసిన చురుకైన, నిరంతర జోక్యం అవసరం. దీనిలో చర్చలకు వేదిక కల్పించడం, జాతి విభేదాలకు కారణమవుతున్న అభివృద్ధి అసమానతలను పరిష్కరించడం, పాలన అందరికీ న్యాయంగా, సమగ్రంగా ఉందనే నమ్మకం కల్పించడం కూడా భాగం కావాలి. అదే సమయంలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడానికి స్పష్టమైన, స్థిరమైన సమాచార వ్యవస్థ అవసరం. ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సంక్షోభ సమయంలో ప్రభుత్వ మౌనం లేదా అస్పష్టత కూడా చర్యల లోపంతో సమానంగా నష్టం కలిగించగలదు. ఘర్షణలు కొనసాగడంలో సమాచార ప్రవాహాల పాత్ర కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశం. తక్షణ సమాచార యుగంలో వదంతులు, నిర్ధారణ లేని ప్రచారం అత్యంత వేగంగా వ్యాపిస్తాయి. చాలాసార్లు అధికారిక ప్రకటనల కంటే ముందుగానే అవి ప్రజల్లోకి చేరిపోతాయి. మణిపూర్‌లో ఉద్రిక్తతలు పెరగడానికి ఇదొక ప్రధాన కారణంగా మారింది.
ఈ సవాలును ఎదుర్కోవడానికి సాంకేతిక చర్యలు మాత్రమే సరిపోవు. విశ్వసనీయ సమాచార వనరులపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే ప్రయత్నాలు కూడా అవసరం. అధికారిక సమాచారంలో పారదర్శకత, ధృవీకరించిన వివరాలను వేగంగా ప్రజలకు అందించడం ద్వారా తప్పుడు ప్రచారం ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. దీర్ఘకాలిక అస్థిరత వల్ల కలిగే ఆర్థిక, సామాజిక ప్రభావాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. రోజువారీ జీవితం దెబ్బతినడం, ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచిపెట్టాల్సి రావడం, ఉపాధి అవకాశాలు క్షీణించడం వంటి పరిస్థితులు ఘర్షణలను మరింత కొనసాగించే వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రత్యేకించి యువత ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాద ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఎక్కువ. విద్య, ఉపాధి అవకాశాలు తగ్గిపోతే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. అందువల్ల దీర్ఘకాలిక శాంతి వ్యూహంలో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక సమగ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి. సమాజాలన్నీ స్థిరత్వంలో తమకూ భాగస్వామ్యం ఉందనే భావన కలిగేలా చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుతం మణిపూర్ అత్యంత కీలక దశలో నిలిచింది. ఇదే పరిస్థితి కొనసాగితే భిన్న సమాజాల మధ్య విభేదాలు మరింత బలపడతాయి. భవిష్యత్తులో సామరస్యాన్ని నెలకొల్పడం మరింత కష్టంగా, ఖరీదైన ప్రక్రియగా మారుతుంది. ప్రతి హింసాత్మక ఘటన ప్రాణనష్టమే కాకుండా పరస్పర అనుమానాలను మరింత పెంచుతోంది. సమాజాలను ఇంకా దూరం చేస్తుంది. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగితే, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడం అంత కష్టమవుతుంది. ఈ హింసా చక్రాన్ని విరమింపజేయడానికి చిన్నచిన్న మార్పులు సరిపోవు.
రాజకీయ ధైర్యం, అసౌకర్యకరమైన వాస్తవాలను అంగీకరించే స్థితి అవసరం. శాంతి కేవలం సంఘటనల తర్వాత తీసుకునే చర్యలతో లేదా ప్రతీకాత్మక నిర్ణయాలతో సాధ్యపడదని అంగీకరించాలి. తక్షణ రాజకీయ లాభాల కంటే న్యాయం, సంభాషణ, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇచ్చే సమగ్ర, నిరంతర ప్రయత్నాల ద్వారానే శాంతిని సాధించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల ముందున్న అసలు సవాలు ఘర్షణను కేవలం నియంత్రించడం కాదు; దానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం. ఆ బాధ్యతను నిరవధికంగా వాయిదా వేయడం సాధ్యం కాదు. ఆలస్యం వల్ల కేవలం అస్థిరత మాత్రమే కాదు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకం కూడా క్రమంగా దెబ్బతింటుంది. మణిపూర్‌కే కాదు, వైవిధ్యభరితమైన సమాజంలో పాలన అనే భావనకే ఇది కీలక పరీక్షగా మారింది. స్పష్టమైన, సమగ్ర, నిరంతర చర్యలు ఇప్పుడు ఒక ఎంపిక మాత్రమే కాదుఅత్యవసరం.
- గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
( రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)












