బెంగాల్‌లో తొలిసారిగా శనివారం బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. ఘనమైన చరిత్ర గల కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం తరువాత చారిత్రక రీతిలో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. స్టేడియంలో వేలాది మంది బిజెపి కార్యకర్తల సందడి, జై శ్రీరామ్ , భారత్ మాతాకీ జై నినాదాలు మిన్నంటుతూ ఉండగా ముఖ్యమంత్రిగా సువేందుతో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రమాణం చేయించారు. దీనితో రాష్ట్రంలో 15 సంవత్సరాల తృణమూల్ పాలన ముగిసింది. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి కేంద్ర నాయకత్వం, ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు , నేతలు సువిశాల వేదికపై ఆసీనులయ్యారు. ప్రధాని మోడీ వేదిక మీదికి నడుసూ వచ్చి ముందుగా అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. చేతులు జోడించారు. రాష్ట్రంలో బిజెపికి అవకాశం ఇచ్చిన బెంగాలీలకు తన ధన్యవాదాలు తెలిపారు.బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. విభిన్న రాజకీయ శక్తుల కేంద్రీకృత బెంగాల్‌లో కాషాయ పార్టీ పట్టు సాధించి,

రాజకీయ రంగు మార్చిన ఘట్టాన్ని బిజెపి చిరస్మరణీయం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. భవానీపూర్ , నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచిన సువేందు ప్రమాణం చేసిన తరువాత, సీనియర్ బిజెపి నేత దిలీప్ ఘోష్ మంత్రిగా ప్రమాణం చేశారు. కేబినెట్‌లోకి ముందుగా ఆరుగురిని మంత్రులుగా తీసుకున్నారు. బిజెపి ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, క్షద్రీయం టుడు, నిసిత్ ప్రామాణిక్ మంత్రులయ్యారు. మంత్రులలో దిలీప్‌ఘోష్, అగ్నిమిత్ర ఉప ముఖ్యమంత్రులుగా నియమితులు అయ్యారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక కుల ప్రాంతీయ సమీకరణలు, సమతూకత నెలకొనేందుకు బిజెపి యత్నించింది. సువేందు అధికారి బెంగాలీ బ్రాహ్మణులు, ఘోష్ ఒబిసి, అగ్నిమిత్ర క్షత్రియ, కిర్తానియా ప్రముఖ మతూవా ప్రతినిధి. టుడు గిరిజన తెగ వ్యక్తి . ప్రముఖ్ ప్రాబల్య రాజ్‌వంశీ నేతగా ఉన్నారు. ప్రాంతాల వారిగా కూడా సమతూకత కల్పించారు. క్షేత్రస్థాయిలో బిజెపి మరింత బలోపేతం దిశలో కేబినెట్ కూర్పులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. రెండో దఫా మంత్రి మండలి ప్రమాణస్వీకారం సోమవారం ఉంటుంది. రాజ్‌భవన్ వేదికగా కార్యక్రమం నిర్వహిస్తారు. సోమవారం నూతన మంత్రివర్గం తొలి సమావేశం జరుగుతుంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మైదానం అంతటా కాషాయ జెండా రెపరెపలు వీచాయి. ఇప్పుడు ప్రమాణ స్వీకార వేదిక అయిన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ రాజకీయ భావజాలం, సిద్ధాంతాల వేదికగా నిలుస్తూ వచ్చింది. లెఫ్ట్ తరువాత టిఎంసి తమ సభలకు ఈ మైదానాన్ని ఎంచుకున్నాయి. ఈ పద్ధతినే బిజెపి కొనసాగించింది. బిజెపి కార్యకర్తలు కమలం గర్తుల జెండాలతో సందడి చేశారు. ఉదయం నుంచే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివచ్చారు. బిజెపి ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో హైటెక్ రీతిలో ఏర్పాట్లు చేసింది. 294 సభ్యుల బెంగాల్ అసెంబ్లీలో బిజెపికి 207 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన అగ్నిమిత్ర పాల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ఆమె ఈ రంగంలో ఎంతో ప్రతిభను , సృజనాత్మకతను చాటారు. 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత బిజెపిలో చేరారు. పార్టీలో దూసుకువెళ్లారు. ఈ క్రమంలో బెంగాల్ బిజెపి మహిళా విభాగం అధ్యక్షురాలు అయ్యారు. బిజెపి వైపు బెంగాలీ మహిళలను ఆకర్షితులు చేసే దిశలో ఆమె సశాస్త్రీయ రీతిలో కదిలారు. టిఎంసి పట్ల వ్యతిరేకత మహిళల ద్వారా తీవ్రతరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో ఆమె తొలిసారిగా అసన్‌సోల్ దక్షిణ్ స్థానంలో గెలిచారు.