
భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్కు భూమిని కేటాయిస్తూ పశ్చిమబెంగాల్ లోని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది. ముళ్ల తీగలకు ఢాకా భయపడదని ఆ దేశ విదేశాంగ శాఖ సలహాదారు ఎం.హెచ్. కబీర్ వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కబీర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు భారత్తో చర్చలు జరుపుతామని వెల్లడించారు. బెంగాల్లో కొత్త ప్రభుత్వం చేసిన ఎన్నికల వాగ్దానాలను తాము గమనిస్తున్నామన్నారు. భారత్ అంతర్గత రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదన్నారు.
తమ సంబంధాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతో ఉంటాయన్నారు. ప్రస్తుతం సవాళ్లు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాల నాయకత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉండగా అధికారం లోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో బంగ్లాదేశ్ వెంబడి ఉన్న సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేపడతామని బీజేపీ ఎన్నికల్లో బలంగా ప్రచారం చేసింది. ఆ దిశగా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్కు భూమిని కేటాయించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు














