మ.2 నుంచి సా.5 వరకు

ఉ.11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి

మ.1.30 గంటలకు గేట్లు మూత

విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచన

విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలి

బూట్లు వేసుకుని రావద్దు...చెప్పులతోనే రావాలి

మనతెలంగాణ/హైదరాబాద్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం(మే 3) దేశవ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) నీట్ పరీక్ష జరుగనున్నది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22,79,743 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా, వారిలో 13,22,928 మంది బాలికలు, 9,46,815 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రం నుంచి నుంచి 70 వేలకుపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలలో, విదేశాలలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇంగ్లీష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెస్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. నీట్ పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల బయో మెట్రిక్ హాజరు తీసుకోవడానికి, సరిపడా బయో మెట్రిక్ మిషన్లను సమకూర్చారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ల సమన్వయంతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్‌ఎస్‌ఎస్‌లోని 163 సెక్షన్ (గతంలో 144 సెక్షన్) అమలులో ఉంటుంది.

ఈ ఏడాది 180 ప్రశ్నలు

నీట్ పరీక్షలో 180 ప్రశ్నలు ఉంటాయి. అన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. 180 ప్రశ్నలలో 45 ప్రశ్నలు ఫిజిక్స్ సబ్జెక్టు నుంచి, 45 ప్రశ్నలు కెమిస్ట్రీ నుంచి, బాటనీ(బయాలజీ, జువాలజీ సబ్జెక్టులు) నుంచి 90 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు సరైన సమాధానం రాస్తే 4 మార్కులు కేటాయిస్తారు. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గుతుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి.. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పెన్ను పరీక్షా కేంద్రంలోనే ఇస్తారు

నీట్ యుజి పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్‌టిఎ ఇప్పటికే ప్రకటించింది. అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫొటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. నీట్ పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లనీయరు. ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్‌లు, హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, హెల్త్ బ్యాండ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్‌టిఎ స్పష్టం చేసింది.

డ్రెస్ కోడ్ నిబంధనలివే

నీట్ పరీక్ష రాసే విద్యార్థులు డ్రెస్ కోడ్‌ను విధిగా పాటించాలి. అబ్బాయిలైనా,అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు ధరించకపోవడం శ్రేయస్కరం.ఫార్మల్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పరు, తక్కువ హీల్ ఉండే సాండిల్స్ మాత్రమే వేసుకుని రావాలి. వ్యాలెట్,పౌచ్, గాగుల్స్, టోపీలు, హ్యాండ్ బ్యాగులు వంటివి తీసుకురావొద్దని ఎన్‌టిఎ తెలిపింది. -

విద్యార్థులకు సూచనలు..

పరీక్షా సమయానికి అరగంట ముందే చేరుకోవాలి

మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకే గేట్లు మూసివేస్తారు కాబట్టి విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలి.

అడ్మిట్ కార్డుపై ముద్రించిన సూచనలు, జాగ్రత్తలను క్షుణ్ణంగా చదివి పాటించాలి. అప్‌డేటెడ్ ఆధార్ కార్డు మాత్రమే తెచ్చుకోవాలి.

మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు, కాలిక్యులేటర్లు, పర్సులు, ఎలాంటి మెటాలిక్ వస్తువులను అనుమతించరు. డ్రెస్ కోడ్‌ను విధిగా పాటించాలి. ఫార్మల్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఫుల్ హ్యాండ్స్ షర్టులు వద్దు. పెద్ద బటన్లు వున్న దుస్తులు, బూట్లు, చెవి పోగులు, జడ క్లిప్పులు, ఉంగరాలు, గొలుసులు, ముక్కు పుడకలు ఉండకూడదు.

పాదరక్షలు సాధారణ స్లిప్పర్లు లేదా సన్నని సోల్ వున్న శాండల్స్ ధరించాలి

వర్ష సూచన ఉన్నందున అడ్మిట్ కార్డులు తడవకుండా ట్రాన్సపరెంట్ పౌచ్లు వాడాలని సూచించింది. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందే బయలుదేరాలని కోరింది.

విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 011-40759000 ఫోన్ నెంబర్‌ను లేదా neetug2026@nta.ac.in మెయిల్ ఐడిని సంప్రదించవచ్చు.