
న్యూఢిల్లీ /తిరువంతపురం ః కేరళలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పేరును గురువారం ప్రకటిస్తారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు దేశ రాజధాని ఢిల్లీలో తెలిపాయి. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ సారధ్య యుడిఎఫ్ ఘన విజయం సాధించింది. ఫలితాలు వెలువడి వారం రోజులు అయినా ఇప్పటికి కాంగ్రెస్ నేత ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనేది తేలలేదు. దీనితో విషయంపై పలు రకాల వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ దశలో పార్టీ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. పలురు నేతలతో సమావేశాలు జరిపారు. రెండు రోజులుగా ఢిల్లీలోని సోనియా గాంధీ జనప్ నివాసం సందడిగా మారింది.
కేరళ పిసిసి మాజీ నేతలతో, పలువురు సీనియర్ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలతో రాహుల్, ఖర్గేలు మాట్లాడారు. తరువాత కాంగ్రెస్ నేత కె మురళీథరన్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. అంతా కొలిక్కి వచ్చిందని , మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారని, గురువారం యుడిఎఫ్ ప్రభుత్వం ఖరారు అవుతుందని స్పష్టం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల నియామకాలు, ప్రభుత్వ ఏర్పాట్లు జరిగిపోయ్యాయి. అయితే స్పష్టమైన మెజార్టీతో యుడిఎఫ్ విజయం దక్కించుకున్నప్పటికీ కేరళలో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం రాజకీయ కీలక పరిణామం అయింది.
అధిష్టానం తరఫున సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, అజయ్ మకెన్ తిరువనంతపురంలో పలువురు నేతలతో, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి, ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చారు. ఈ దశలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనేది గురువారం తేలనుందని వెల్లడైంది. గురువారం సిఎం పై ప్రకటన వెలువడుతుందని కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సన్నీ జోసెఫ్ తిరువనంతపురంలో తెలిపారు. నిజానికి బుదవారం ఈ విసయం ప్రకటన వెలువడాలి. అయితే పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి వైద్య పరీక్షలు జరగడంతో ఈ ప్రక్రియ సాయంత్రం వరకూ నిలిచిపోయిందని ఆయన వివరించారు.














