
న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ కేసులో మాస్టర్‌మైండ్ రాజస్థాన్‌కు చెందిన మనీష్ యాదవ్‌ను నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మంది అరెస్టు అయ్యారు. రాజస్థాన్ పోలీసుల అభ్యర్థనపై నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడ్ని అదుపు లోకి తీసుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్‌కుమార్ చౌహాన్ వెల్లడించారు. ఈనెల 3న జరిగిన నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120 కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపరును గుర్తించినట్టు రాజస్తాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్టు గుర్తించారు.
ఇందులోని సమాచారం ... నీట్ ప్రశ్న పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హం. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌నుంచి నేరుగా లీకైనట్టు బయటపడింది. ప్రింటింగ్ ప్రెస్‌తో సంబంధం ఉన్న వ్యక్తి తన నెట్వర్క్ చైన్ ద్వారా పేపర్ లీకేజీని చేసినట్టు గుర్తించారు.నాసిక్‌లోని ముద్రణశాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఆ ప్రశ్నాపత్రాన్ని చైన్ నెట్వర్క్ ద్వారా హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వైద్యుడికి చేరవేసినట్లు సమాచారం. అనంతరం జైపూర్‌లోని జంవా రామ్‌గఢ్‌కు చెందిన ఖాటిక్ అనే వ్యక్తి ఆ వైద్యుడి నుంచి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నాసిక్ ముద్రణశాలకు సంబంధం ఉన్న వ్యక్తిని ఇప్పటికే సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
15 రోజుల ముందే లీక్
జంవా రామ్‌గఢ్ నుంచి ప్రశ్నాపత్రం రాజస్థాన్‌లోని సికర్‌కు చెందిన రాకేష్ కుమార్ మండావారియా అనే వ్యక్తికి చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాకేష్ సికర్‌లోని ప్రముఖ కోచింగ్ సంస్థల బయట ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి ప్రశ్నాపత్రం వన్ టు వన్ నెట్వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్లలోని కోచింగ్ కేంద్రాలకు కూడా ఈ ప్రశ్నాపత్రం చేరినట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అసలు ప్రశ్నాపత్రాన్ని గెస్ పేపర్ పేరుతో విద్యార్థులకు పంపిణీ చేశారు. సాధారణంగా గత సంవత్సరాల పేపర్లను ఆధారంగా చేసుకుని ట్యూటర్లు సిద్ధం చేసే ప్రాక్టీస్ ప్రశ్నలను గెస్ పేపర్లుగా వ్యవహరిస్తారు. అయితే ఈసారి అసలు ప్రశ్నాపత్రాన్నే గెస్ పేపర్‌గా ప్రచారం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. పరీక్షకు దాదాపు 15 రోజుల ముందుగానే ఈ పేపర్ విద్యార్థుల్లో చక్కర్లు కొట్టినట్లు దర్యాప్తులో తేలింది. దీని కోసం రూ.30 వేల నుంచి రూ.28 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. నాగౌర్‌కు చెందిన ఓ విద్యార్థి మే 3 పరీక్షకు నాలుగు రోజుల ముందే సికర్‌కు వచ్చి ప్రశ్నాపత్రం కోసం రూ.28 లక్షలు చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. ‘పేపర్ వచ్చేసింది’ అంటూ ఢిల్లీ నుంచి తనకు ఫోన్ వచ్చినట్లు ఆ విద్యార్థి అధికారులకు తెలిపినట్లు సమాచారం.
డబ్బు ఆశతో బయటపడిన మాఫియా గుట్టు
ఇలాంటి ప్రశ్నాపత్రాల అక్రమ రవాణా సాధారణంగా అత్యంత గోప్యంగా నిర్వహిస్తారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో నెట్‌వర్క్‌ను విస్తరించడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిపై నిఘా ఉంచిన సీబీఐ, ప్రశ్నాపత్రం లీక్ చైన్‌లో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ‘రేపటి పరీక్షలో ఇవే వస్తాయి’ అనే ఒక సందేశంతో ప్రారంభమైన ఈ వ్యవహారం చివరకు దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రశ్నాపత్రం మాఫియా ను బయటపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దర్యా ప్తు వివరాల ప్రకారం, సికర్‌కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మొదట ప్రశ్నాపత్రాన్ని రూ.30వేలకే తనకు పరిచయమై న ఒక విద్యార్థికి విక్రయించాడు. ఆ విద్యార్థి కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికర్‌కు చెందినవాడిగా గుర్తించారు. పరీక్షకు కేవలం ఒక రోజు ముందు ఆ ఎంబీబీఎస్ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని సికర్‌లో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్న తన తండ్రికి పంపించాడు. ‘నాన్నా.. సికర్‌కు చెం దిన ఓ స్నేహితుడు ఇది పంపించాడు. మీ హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు ఇవ్వండి. రేపటి పరీక్షలో ఇవే వస్తాయి’ అని సందేశంలో పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అంతగా అనుమానం పెట్టుకోకుండా ఆ పీజీ నిర్వాహకుడు హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు ఆ ప్రశ్నాపత్రాన్ని పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వద్ద నుంచి ఎన్టీఏ వరకు..
ఈ విషయం తెలుసుకున్న తర్వాత పీజీ నిర్వాహకుడు మొదట సికర్‌లోని ఉద్యోగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ‘వదంతులు వ్యాప్తి చేయొద్దు’ అంటూ పోలీసులు తన ఫిర్యాదును ప ట్టించుకోలేదని అతడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. తరువాత అతడు ఈ సమాచారాన్ని నీట్ పరీక్ష నిర్వహిం చే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)కి అందించాడు. ఎన్టీఏ ఈ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి పం పగా, అక్కడి నుంచి రాజస్థాన్ పోలీసులకు సమాచారం చేరింది. దీంతో రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) విచారణ ప్రారంభించి, తొలి దశలో పీజీ నిర్వాహకుడితోపాటు 15మందిని అదుపులోకి తీసుకుంది.













