భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉందని, ఆ గ్రామాలకు వెన్నెముక వ్యవసాయమని మనం దశాబ్దాలుగా వల్లెవేస్తున్నాం. రైతే రాజు అన్న నినాదం గోడలమీద అక్షరాలకే పరిమితమైంది తప్ప, క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితి నేటికీ అగమ్యగోచరంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఒక లాభసాటి పరిశ్రమగా మారుతూ.. అత్యాధునిక సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తుంటే, మన దేశంలో మాత్రం సాగు ఇంకా జూదంలాగే మిగిలిపోయింది. సారవంతమైన నేలలు, సమృద్ధిగా నీటి వనరులు, ఆరుగాలం కష్టపడే రైతాంగం ఉన్నప్పటికీ.. సరైన దిశానిర్దేశం, ఆధునీకరణ లేకపోవడంవల్ల మన వ్యవసాయం ‘నేల విడిచి సాము’ చేస్తున్న చందంగా తయారైంది. ప్రపంచ మార్కెట్‌లో ఇతర దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తులతో సత్తా చాటుతున్న వేళ, మనం మాత్రం ఇంకా సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయం. ఆధునీకరణ, యాంత్రీకరణ అనేవి నేడు సౌకర్యాలు కాదు, అత్యంత ఆవశ్యకత. ఇజ్రాయెల్ వంటి చిన్న దేశాలు నీటి ఎద్దడి ఉన్నా, ఎడారి నేలల్లో కూడా సాంకేతికతతో సిరులు పండిస్తున్నాయి.

డ్రోన్ల వినియోగం, ప్రిసిషన్ ఫార్మింగ్ (ఖచ్చితత్వ వ్యవసాయం), సెన్సార్ల వాడకంతో ఆ దేశాలు తక్కువ ఖర్చుతో గరిష్ట దిగుబడిని సాధిస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ట్రాక్టర్ల వాడకం పెరిగినంత మాత్రాన అది యాంత్రీకరణ అనిపించుకోదు. విత్తనం నాటిన దగ్గర నుండి పంట కోత కోసి, మార్కెట్‌కు తరలించే వరకు ప్రతి దశలోనూ యంత్రాల వినియోగం పెరగాలి. సంప్రదాయ శ్రమశక్తిపైనే ఆధారపడటం వల్ల సాగు ఖర్చు పెరిగి, చివరకు రైతు చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అగ్రి-టెక్ విప్లవం కొనసాగుతున్నా, మన రైతులు ఇంకా సంప్రదాయ విత్తనాలు, పాత పద్ధతులకే పరిమితం కావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడలేకపోతున్నాం. మరో ప్రధాన సమస్య నేల ఆరోగ్యం. ఏ పంటకు ఏ నేల అనుకూలమో, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకోకుండానే ఎరువులు వేయడం గుడ్డిలోమెల్ల చందంగా మారింది.

నేల పరీక్షలు అనేవి కేవలం ప్రభుత్వ రికార్డులకే పరిమితమవుతున్నాయి. రైతులకు నామమాత్రపు సూచనలు మాత్రమే అందుతున్నాయి. దీనికి తోడు, అధిక దిగుబడి పేరుతో వాణిజ్య సంస్థల ప్రలోభాలకులోనై రైతులు విచక్షణారహితంగా క్రిమిసంహారకాలను, రసాయనిక ఎరువులను వాడుతున్నారు. ఇది కేవలం నేల తల్లిని నిర్జీవం చేయడమే కాకుండా, పండిన ఆహారాన్ని విషతుల్యం చేస్తోంది. ఈ రసాయన అవశేషాల వల్ల ప్రజలు కేన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల బారినపడుతున్నారు. ఒకప్పుడు సహజ సిద్ధమైన పోషకాలతో విరాజిల్లిన మన నేలలు నేడు రసాయనిక ఎరువుల మీద ఆధారపడితే తప్ప మొలకరాని స్థితికి చేరుకోవడం ఒక సామాజిక విపత్తు. ఆర్థిక కోణంలో చూస్తే, రైతు సంకెళ్లు ఇంకా తెంచుకోలేదు. వ్యవసాయ రుణాలు నేటికీ పారదర్శకంగా సామాన్య రైతుకు అందడం లేదు.

బ్యాంకుల నిబంధనలు, అధికార యంత్రాంగం చుట్టూ తిరగలేక సగటు రైతు ఇంకా గ్రామీణ వడ్డీ వ్యాపారుల దగ్గరే అప్పులు చేస్తున్నాడు. వాణిజ్య పంటలు పండించాలంటే భారీ పెట్టుబడి అవసరం. కానీ ఆ పెట్టుబడి భద్రత లేని స్థితిలో రైతు సాహసం చేయలేకపోతున్నాడు. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు లేదా మార్కెట్ మాయాజాలం వల్ల గిట్టుబాటు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఏటా వింటున్న రైతు ఆత్మహత్యల వార్తలు మన అభివృద్ధి నమూనాపై మచ్చలా మిగిలిపోతున్నాయి. పండిన పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేకపోవడం, దళారుల ప్రమేయం అధికంగా ఉండటం వల్ల శ్రమ ఒకరిది.. సంపాదన మరొకరిది అన్నట్లుగా సాగు రంగం తయారైంది.

ప్రభుత్వాల పాత్ర ఇక్కడ అత్యంత కీలకం. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు కేవలం నగదు బదిలీ పథకాలతోనో, ఓట్ల రాజకీయం కోసం రుణమాఫీలతోనో బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నాయి. ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి కానీ, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించలేవు. వ్యవసాయ రంగంలో ఒక ‘గుణాత్మక మార్పు’ రావాలి. అది కేవలం సబ్సిడీల రూపంలో కాకుండా, మౌలిక సదుపాయాల కల్పన రూపంలో ఉండాలి. ప్రతి గ్రామంలో కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. అప్పుడే రైతు తన పంటను భద్రపరుచుకుని, ధర ఉన్నప్పుడు అమ్ముకోగలడు. మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, ఆ ప్రయాణంలో వ్యవసాయాన్ని విస్మరించడం అసాధ్యం. రైతు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే దేశీయ మార్కెట్‌లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. సాగును కేవలం జీవనోపాధిగా కాకుండా ఒక గౌరవప్రదమైన వృత్తిగా మార్చాలి. నేల తల్లిని రక్షించుకుంటూ, సాంకేతికతను జోడించి సాగు చేస్తేనే భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణగా నిలుస్తుంది. ఆ దిశగా అడుగులు వేయడం ఇప్పుడు మనముందున్న చారిత్రక అవసరం. 

- మేకల క్రిష్ణ, 99485 56978