
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి ఎన్నో శాఖలు ఉన్నా, ప్రజలతో అత్యంత ప్రత్యక్ష సంబంధం కలిగి, ప్రభుత్వ ఉనికిని నేలమీద ప్రతిఫలింపజేసే శాఖ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ శాఖే. ఈ శాఖను కేవలం భూముల పరిపాలనకు పరిమితమైన యంత్రాంగంగా చూడటం దాని అసలైన పరిధిని, ప్రాముఖ్యతను అణగదొక్కినట్లే అవుతుంది. వాస్తవానికి రెవెన్యూ శాఖ అనేది రాష్ట్ర పరిపాలనా నిర్మాణానికి వెన్నెముక మాత్రమే కాదు, అది ప్రభుత్వ కార్యాచరణకు క్షేత్రస్థాయి జీవనాడి. గ్రామ సరిహద్దునుంచి రాష్ట్ర రాజధానివరకు విస్తరించిన పరిపాలనా శ్రేణిలో ప్రభుత్వానికి కళ్ళూ, చెవులూ, చేతులూ అన్నీ ఈ శాఖే. ప్రజలు ప్రభుత్వాన్ని మొదటగా స్పృశించే స్థలం తహసీల్దార్ కార్యాలయం; జిల్లా పరిపాలనను క్షేత్రస్థాయిలో నడిపించే ప్రధానశక్తి కలెక్టరేట్; ఈ రెండింటి వెనుక నిలిచేది రెవెన్యూ యంత్రాంగమే. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల గడప దాటే మార్గం ఇదే. పౌరుడి జీవితం ప్రభుత్వ వ్యవస్థతో అనుసంధానమయ్యే ప్రతి దశలో రెవెన్యూ శాఖ ఉంటుంది. పుట్టుక నమోదులోనూ, మరణ ధ్రువీకరణలోనూ, కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువపత్రాల జారీలోనూ, వారసత్వ హక్కుల నిర్ధారణలోనూ ఈ శాఖ పాత్ర అనివార్యం.
విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకం, రిజర్వేషన్, రుణం, ప్రతి అవకాశానికీ అవసరమైన ప్రాథమిక ధ్రువీకరణను అందించే బాధ్యత ఈ శాఖదే. అందువల్ల రెవెన్యూ శాఖ ప్రజలకు సేవలందించే శాఖ మాత్రమే కాదు; పౌర హక్కులకు పరిపాలనా ద్వారం. భూమి భారతీయ సమాజంలో కేవలం ఆస్తి కాదు, ఆర్థిక స్థిరత్వానికి ఆధారం, కుటుంబ గౌరవానికి ప్రతీక, అనేక కుటుంబాల జీవనాధారం. అలాంటి భూమికి సంబంధించిన రికార్డుల నిర్వహణ, మ్యూటేషన్లు, సర్వేలు, సరిహద్దుల నిర్ధారణ, వివాదాల పరిష్కారం, ప్రభుత్వ భూముల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు, భూస్వాధీనం వంటి అత్యంత సున్నితమైన వ్యవహారాలన్నీ రెవెన్యూ శాఖ పరిధిలోనే ఉంటాయి. భూమి వ్యవహారాల్లో ఈ శాఖ తీసుకునే నిర్ణయాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రభావాలను కలిగించేంత కీలకమైనవి. సంక్షేమ రాష్ట్రంగా ప్రభుత్వపాత్ర విస్తరించిన నేటి కాలంలో రెవెన్యూ శాఖ ప్రాధాన్యం మరింత పెరిగింది. పింఛన్లు, రైతుపథకాలు, ఉపశమన ప్యాకేజీలు, విపత్తు పరిహారం, పేదల గుర్తింపు, లబ్ధిదారుల ధ్రువీకరణ ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాల భౌతిక అమలులో రెవెన్యూ యంత్రాంగమే కీలక ఆధారం. ప్రభుత్వ నిర్ణయం కేబినెట్‌లో పుడితే, అది ప్రజల ఇంటివద్ద ఫలితంగా కనబడేందుకు పనిచేసేది రెవెన్యూ వ్యవస్థే. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల నిర్వహణలోనూ ఈ శాఖ పాత్ర అపారమైనది.
అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలు, సహకార సంఘా లు, ఏ ఎన్నికైనా ఫీల్డ్ స్థాయిలో నిర్వహించే యంత్రాంగం రెవెన్యూ శాఖే. ఓటరు జాబితా సవరణలనుంచి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వరకు, పోలింగ్ సిబ్బంది మోహరింపు నుంచి ఎన్నికల చట్టవ్యవస్థ నిర్వహణ వరకు ఈ శాఖ మౌనంగా కానీ అత్యంత బాధ్యతతో పనిచేస్తుంది. ప్రజాస్వామ్యం సజావుగా నడవడానికి అవసరమైన నిర్వహణా సామర్థ్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. విపత్తుల సమయంలో ప్రజలకు ముందుగా కనిపించే ప్రభుత్వచేయి కూడా రెవెన్యూ శాఖే. వరదలు, అగ్నిప్రమాదాలు, కరువు, అంటువ్యాధులు, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ యంత్రాంగం 24 గంటలూ ప్రజల మధ్యే ఉంటుంది.
నష్టం అంచనానుంచి పరిహారం పంపిణీవరకు, పునరావాసంనుంచి పునర్నిర్మాణంవరకు ప్రభుత్వ స్పందనకు ఫీల్డ్ రూపం ఇదే. సంక్షోభకాలంలో ప్రభుత్వ మానవత్వాన్ని ప్రజలు అనుభవించేది ఈ శాఖ ద్వారానే. పరిపాలన, భద్రత, ప్రజాసేవ మూడింటినీ ఏకకాలంలో మోసే అరుదైన శాఖ ఇదే. రాష్ట్ర పరిపాలనను సమగ్రంగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది, రెవెన్యూ శాఖ లేకుండా జిల్లా పరిపాలన నిలవదు; జిల్లా పరిపాలన బలహీనమైతే ప్రభుత్వ ప్రభావం ప్రజల జీవితాల్లో కనిపించదు. నేటి వేగవంతమైన పాలనా వ్యవస్థలో ఈ శాఖపై పడుతున్న బాధ్యతలు మరింత పెరుగుతున్న వేళ, దానికి తగిన గుర్తింపు, వనరులు, సాంకేతిక బలోపేతం, మానవ వనరుల బలోపేతం అత్యవసరం. ఎందుకంటే: రాష్ట్ర పరిపాలన ఒక శరీరమైతే, దానికి శ్వాసనిచ్చేది రెవిన్యూ శాఖ. ప్రభుత్వం ఒక సంకల్పమైతే, దానికి నేలమీద రూపమిచ్చేది రెవెన్యూ శాఖ.
రమేష్ పాక
90009 13434










