జబల్పూరు : మధ్యప్రదేశ్‌లో ఓ నాటుపడవ బోల్తా పడిన ఘటనలో నలుగురు నీట మునిగి చనిపోయారు. ఇప్పటివరకూ 15 మందిని ప్రాణాలతో బయటుకు తీశారని అధికారులు తెలిపారు. బార్గీ డ్యామ్ రిజర్వాయర్‌లో ఈ నాటుపడవలో మొత్తం 29 మంది ప్రయాణికులు వెళ్లుతున్నారు. ఈ దశలో ఆకస్మాత్తుగా గాలి దుమారం వీచింది. దీనితో పడవ బోల్తా పడిందని వెల్లడైంది. జబల్పూరు జిల్లాలో నర్మదా నదిపై బార్గీ డ్యామ్ నిర్మించారు. రిజర్వాయర్‌లో తిరిగేందుకు వెళ్లిన పడవ ఈ ప్రమాదానికి గురైంది.

ఘటనలో నలుగురు మృతి చెందారు, పది మంది జాడ తెలియకుండా ఉంది. నదీ ప్రవాహం లో వీరికోసం గాలిస్తున్నారు.ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. స్థానిక అధికార యంతాంగం హుటాహుటిన రంగంలోకి దిగిందని తెలిపారు. జబల్పూరు కలెక్టర్, ఎస్‌పి ఇతర ఉన్నతాధికారులు , విపత్తు నిర్వహణ దళాలు, ఇతర సహాయక బృందాల చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.