
ప్రశ్నాపత్రం లీక్‌తో నీట్ పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థుతి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్‌డిఎ ప్రభుత్వ వైఫల్యం వల్లనే మరోసారి పేపర్ లీకైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందని మండిపడ్డారు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందని ఆక్షేపించారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీని వెనక ఎంత పెద్దవాళ్ల హస్తం ఉన్నా, వాళ్లందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సూచించారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.













