మన తెలంగాణ/ కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బీహార్, పశ్చిమబెంగాల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకులు, నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకునే కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. బీహార్ జైలులో ఉండి కూడా దోపిడీలను శాసిస్తున్న ‘ది గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ ఈ భారీ స్కె చ్ వెనుక సూత్రధారి అని విచారణలో తేలిందని గురువారం కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏ ర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. సీపీ తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. ఈ నెల 3న కరీంనగర్ 2 -టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడిన దుండగులు,


తుపాకులతో సిబ్బందిని బెదిరించి సుమారు రూ.82.02 లక్షల విలువైన 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ప్రతిఘటించిన నలుగురు సిబ్బందిపై నిందితులు కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక నిఘా, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. బుధవారం సాయంత్రం వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు ముఠాసభ్యులు రవీష్ కుమార్, సిమ్ కార్డులు సరఫరా చేసిన మెహతాబ్ ఖాన్‌లను బీహార్, బెంగాల్‌లలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తరలించారు. వీరి వద్ద నుంచి రూ. 51,000 నగదు, రెండు సెల్ ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

దోపిడీ ప్రణాళిక సాగిందిలా..

ఈ ముఠా రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చి ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాల్లోని బ్యాంకులు, జ్యువెలరీ షాపులపై నిఘా పెట్టింది. మహారాష్ట్రలోని గఢ్‌చందూర్ పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఆరు పిస్టళ్లు, మ్యాగజైన్లను రఘునాథ్ కర్మాకర్ సేకరించాడు. తప్పుడు పేర్లతో లాడ్జిలలో బస చేస్తూ, నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్న బైక్‌లను నేరానికి ఉపయోగించారు. దోపిడీ అనంతరం ముఠాసభ్యులు అటవీ మార్గాల్లో, రైళ్ల ద్వారా వేర్వేరు రాష్ట్రాలకు పరారయ్యారు. దోచుకున్న సొమ్మును అడవి ప్రాంతంలో ఒక క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు అప్పగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

కరుడుగట్టిన నేరచరిత...

అరెస్టయిన రఘునాథ్ కర్మాకర్‌పై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో హత్య, దోపిడీకి సంబంధించిన 7 కేసులున్నాయి. మరో నిందితుడు రవీష్‌కుమార్‌పై ఏకంగా 15 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులో ఇంకా 10 మంది పరారీలో ఉన్నారని, వారికోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని కమిషనర్ గౌస్ ఆలం పేర్కొన్నారు.

పోలీసుల హెచ్చరిక

ఈ కేసు ఛేదన ద్వారా తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల ముఠాలకు బలమైన హెచ్చరిక పంపారు. వ్యాపారసంస్థలు, బ్యాంకులు తప్పనిసరిగా నాణ్యమైన సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, లాడ్జి యజమానులు ఐడీ కార్డులు లేకుండా గదులు ఇవ్వకూడదని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని కోరారు.