ఒకప్పుడు రాజ్యాలను పాలించి, యుద్ధరంగాల్లో వీరత్వం ప్రదర్శించి చరిత్రలో స్థానం సంపాదించిన ముదిరాజ్ జాతి, నేడు తన అస్తిత్వంకోసం సంఖ్యాబలంలోనే సింహభాగం కోల్పోతూ విలపిస్తోంది. ‘ముదిరాజ్’ అంటే రాజసం అనే గర్వం రక్తంలో ఉన్నా, వాస్తవ జీవితం పేదరికం, విద్యా విహీనత, ఉద్యోగ వంచన, శ్రమ దోపిడీల మధ్య నలిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కులాలవారీ జనాభా సర్వే (SEEEPC) నివేదిక ఈ సామాజిక విషాదాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. రాష్ట్రంలోని 242 కులాలలో అత్యధిక జనాభా సంఖ్యలో ఒకటైన ముదిరాజ్ సమాజం (ముదిరాజ్, ముత్రాసి, తెనుగొల్లు) దాదాపు 26.39 లక్షల మంది (7.4 శాతం) ఉన్నారు. బిసిలలో అతిపెద్ద సమూహం కావడం విశేషం.కానీ, సమ్మిళిత వెనకబాటుతన సూచీ (Composite Backwardness Index CBI)లో వారి స్కోరు 94 పాయింట్లు. రాష్ట్ర సగటు 81 పాయింట్లు అయితే, ఎస్‌సిలు 96, ఎస్‌టిలు 95 పాయింట్లతో సమానంగా లేదా దగ్గరగా ఉండటం ఆందోళనకరం.

ఈ సూచీ 42 ప్రధాన అంశాల ఆధారంగా తయారైంది. ఇందులో ఎక్కువ స్కోరు ఎక్కువ వెనకబాటుతనాన్ని సూచిస్తుంది. తెలంగాణ కులగణన నివేదిక 135 కులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వెనకబడి ఉన్నట్లు చెబుతోంది. ముదిరాజులు వాటిలో అగ్రస్థానంలో ఉండటం పాలకులకు హెచ్చరిక. నివేదికలు కాగితాల మీద లెక్కలు కావు; అవి ఒక జాతి ఆర్తనాదాలు. అర్హత ఉన్న వారిని అన్యాయపు వర్గీకరణ గొలుసుల్లో బంధించడం చరిత్ర క్షమించదు. విద్య అనేది సామాజిక విముక్తికి మార్గం. కానీ ముదిరాజ్ బిడ్డలకు అది ఇంకా దూరంగానే ఉంది. రాష్ట్ర సగటు విద్యా సూచీలతో పోల్చినప్పుడు ముదిరాజులు వెనకబడి ఉన్నారు. పాఠశాల డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉండటం, డిగ్రీస్థాయి విద్యలో తక్కువ ప్రాతినిధ్యం, ప్రభుత్వ పాఠశాలలపై ఎక్కువ ఆధారపడటం వీరి ఆర్థిక దుస్థితికి అద్దం పడుతుంది. ఇంగ్లీష్ మీడియం విద్యలో కూడా వారి వాటా రాష్ట్ర సగటు కంటే తక్కువ. ఎస్‌సి (మాల), ఎస్‌టి (లంబాడీ) సోదరుల కంటే కూడా కొన్ని సూచీల్లో దిగువన ఉండటం ఆశ్చర్యకరం. ఈ విద్యా లోటు తర్వాతి తరాలను కూలీలుగా, దినసరి శ్రమికులుగా మార్చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో ముదిరాజుల వాటా కేవలం 1.6 శాతం మాత్రమే. రాష్ట్ర సగటు 3 శాతం ఉండగా, ఇతర బిసి, ఎస్‌సి, ఎస్‌టి ఉపకులాల కంటే తక్కువ. ప్రైవేటు రంగంలో కూడా 4.6 శాతం మాత్రమే. 14 శాతం (బిసిలలో అత్యధిక) జనాభా ఉన్న సమాజం ఉద్యోగ, నిర్ణయాధికార రంగాల్లో ఇంత వెనకబడి ఉండటం వ్యవస్థీకృత వివక్షకు నిదర్శనం. ఎన్నికల సమయంలో మాత్రమే ‘ఓటు యంత్రాలు’గా గుర్తుకు వచ్చి, తర్వాత విస్మరణకు గురవుతున్నారు. 43 శాతం దినసరి కూలీలు, 28 శాతం వ్యవసాయ కూలీలు, 15.6 శాతం మత్స్యకారులుగా జీవితం సాగిస్తున్నారు. సంప్రదాయ వృత్తులపై ఆధారపడి, సీజనల్ దారిద్య్రం, అప్పుల ఊబిలో మగ్గుతున్నారు.వార్షిక ఆదాయం రాష్ట్ర సగటు కంటే తక్కువగా, లక్ష రూపాయల లోపులోనే ఉండటం వారి జీవన ప్రమాణాలను క్షీణింపజేస్తోంది. గృహ వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య సౌకర్యాల్లోనూ తీవ్ర లోటు ఉంది. బాలికల విద్య, బాల్య వివాహాలు వంటి సామాజిక సమస్యలు కూడా ఈ వెనకబాటుతనాన్ని మరింత లోతుగా చేస్తున్నాయి.

ప్రభుత్వం ఇకనైనా ఈ గణాంకాలను గమనించి, ముదిరాజ్ సమాజాన్ని బిసి -డి నుండి విముక్తి చేసి, న్యాయమైన రిజర్వేషన్ వాటా కల్పించాలి. విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక పథకాలు, స్కాలర్‌షిప్, వృత్తి శిక్షణలు, సంప్రదాయ వృత్తులకు ఆధునికీకరణ అవసరం. రాజరికం కేవలం పేరులో మాత్రమే కాక, వారి బతుకుల్లోనూ ప్రతిబింబించాలి. బిసి -డి వర్గంలో ఉండటం వల్ల ముదిరాజులు సరైన రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోతున్నారు. అర్హత ఉన్నా, తప్పుడు వర్గీకరణల వల్ల వెనకబడిపోవడం ఒక వ్యవస్థీకృత నేరం. గత ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అన్యాయం ఇప్పుడు ప్రభుత్వ నివేదికలోనే బయటపడింది. రిజర్వేషన్ పరంగా ముదిరాజులకు న్యాయమైన వాటా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం ఒక కులం సమస్య కాదు; తెలంగాణ సామాజిక ఆత్మకు తగిలిన గాయం. ఈ గణాంకాలు కేవలం కాగితాల మీద లెక్కలు కావు.. ఒక వీర జాతి గొంతులో గడ్డకట్టిన నిశ్శబ్ద కేకలు. ప్రతి అంకె వెనుక ఒక ముదిరాజ్ బిడ్డ ఆశయం సమాధి అవుతోంది, ప్రతి శాతం వెనుక ఒక ముదిరాజ్ తల్లి కడుపు కోత కనిపిస్తోంది.

భవిష్యత్తుకు ఉరిశిక్ష: అక్షరం అందని ద్రాక్షగా మారుతుంటే, ముదిరాజ్ గూడెంలలో సరస్వతీ పుత్రులు కావాల్సిన బిడ్డలు.. చదువుల తలుపులు మూసుకుపోయి చీకటి గదుల్లో మగ్గుతున్నారు. ఇది కేవలం అజ్ఞానం కాదు, ఒక తరాన్నే విజ్ఞానానికి దూరం చేస్తున్న మేధోపరమైన హత్య. ఆరిపోతున్న ఆశల దీపం: రాష్ట్ర జనాభాలో సింహభాగం మాదే.. కానీ అధికార పీఠాల్లో మా వాటా శూన్యం. 14 శాతం సంఖ్యాబలం ఉన్న మాకు 1 శాతం ఉద్యోగం దక్కకపోవడం దారుణం. మా బిడ్డల ప్రతిభను రిజర్వేషన్ల వర్గీకరణ అనే ‘రాజకీయ సంకెళ్లు’ బలి తీసుకుంటుంటే, పట్టభద్రులు కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితి.. ఇది వ్యవస్థీకృత నేరం కాక మరేమిటి? కూలీలుగా వీరపుత్రులు: ఒకప్పుడు ఈ గడ్డను ఏలిన రాజులు, నేడు అడగడుగునా ఎండిపోయిన చెరువుల సాక్షిగా, రాలిన చెమట చుక్కల సాక్షిగా కూలీలుగా మారుతున్నారు. రాజ్యాలు ఏలిన చేతులు.. నేడు రెక్కాడితే గానీ డొక్కాడని దైన్యంలో, దినసరి కూలీలుగా, వ్యవసాయ కార్మికులుగా తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్నాయి.

దుర్భర జీవన ప్రమాణాలు: రాష్ట్ర సగటు కంటే దారుణమైన స్థితిలో, ఎస్‌సి, ఎస్‌టి సోదరుల కంటే వెనుకబడిన జీవితాన్ని అనుభవిస్తూ.. ఇంకా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఉన్నత వర్గీకరణలో ఉంచడం సామాజిక విషాదం. ప్రతి గ్రామంలో, ప్రతి రచ్చబండ దగ్గర ముదిరాజ్ జీవితం ఒక కన్నీటి కావ్యంలా మారుతోంది. గౌరవప్రదమైన జీవితం ముదిరాజులకు అందని ద్రాక్షేనా? చరిత్రలో పూర్వకాలంలో రాజులుగా, సైన్యాధ్యక్షులుగా, సైనికులుగా, గ్రామపాలకులుగా, గ్రామరక్షకులుగా, చెరవుల నిర్వాహకులుగా, వ్యవసాయదారులుగా.. ఇట్లా అనేక పాత్రల్లో ఒదిగిపోయి కుటుంబాలను పోషించకుంటున్న ముదిరాజుల్లో ఎక్కువ సంఖ్యలో మత్స్యకారులుగా స్థిరపడటంవల్ల చేపలుపట్టడం వారి కులవృత్తిగా స్థిరీకరించుకున్నారు. సుమారు ఐదుదశాబ్దాలకు పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలను ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజించిన సందర్భంలో అనుసరించిన తప్పుడు విధానాల ఫలితంగా ముదిరాజులను బిసి ఎ గ్రూపులో చేర్చడానికి బదులుగా బిసి డి గ్రూపులోకి మార్చారు.

ఈ పొరపాటును సవరించే లక్ష్యంలో 2009లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ముదిరాజులను బిసి ఎ గ్రూపులోకి చేరుస్తూ తీసుకున్న నిర్ణయం అమలుకు నోచుకోకుండానే 12 సంవత్సరాలపాటు హైకోర్టు, సుప్రీం కోర్టులలో నానుతూ వచ్చింది. చివరకు గత ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితంగా సుప్రీం కోర్టు తెలంగాణ బిసి కమిషన్‌కు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఇదే అంశాన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి ముదిరాజులను బిసి డి నుండి బిసి ఎ గ్రూపులోకి మారుస్తామని ఖచ్చితమైన హామీని ప్రకటించింది. ఈ హామీని ప్రకటించిన గడచిన రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులాలవారీ జనాభా గణనలో ముదిరాజులు అనేక సామాజిక అంశాలలో బిసిలకంటే, ఎస్‌సిలకంటే, ఎస్‌టిలకంటే కూడా వెనకబడి ఉన్నట్లు సంఖ్యాపరమైన ఆధారాలు స్పష్టమయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి అనుకూలంగా, ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే స్వయంగా నిర్వహించిన జనాభా లెక్కలు, రిజర్వేషన్ల అమలులో గడచిన 50 సంవత్సరాలుగా ముదిరాజులకు తీరని అన్యాయం జరుగుతున్నదని తేల్చి చెబుతున్నాయి. బిసి కులాలన్నింటిలోనూ అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న ముదిరాజ్ సామాజికవర్గం ప్రజలకు సుదీర్ఘ కాలంగా రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన రిజర్వేషన్ సౌకర్యాలను అందించకుండా.. తెలంగాణ రాష్ట్రం లో ఈ ప్రభుత్వం బిసిల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తున్నదని జబ్బలు చరుచుకోవడం ఒక ఆత్మవంచనగానే భావించాలి.

గంగపుత్రులు, మాలలు, లంబాడీలకంటే ముదిరాజులు అనేక అంశాలలో వెనకబడి ఉన్నారు. విద్య, ఉద్యోగాలు, వృత్తి, జీవన ప్రమాణాలు, పట్టణ- గ్రామీణ వెనకబాటుతనం ప్రతి రంగంలోనూ వారు అత్యంత వెనుకబడిన వర్గం. ఈ గణాంకాలు ఒక సమాజం బాధను, నిరాశను, నిశ్శబ్ద కేకలను మన ముందుంచుతున్నాయి. ముదిరాజుల వెనకబాటుతనం ఇది కేవలం సంఖ్యల కథ కాదు, ఇది ఒక సమాజం హృదయ విదారక వాస్తవం. ఈ గణాంకాలు కేవలం ఈ పాలకుల కళ్లు తెరిపించడానికి మాత్రమే కావు, ఒక జాతి ఆత్మగౌరవ పోరాటం రణక్షేత్రంగా మారకముందే.. రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన న్యాయమైన వాటాను అందించాలని ముదిరాజ్ సామాజికవర్గం ఎన్నికల కాలంలో హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోమారు కోరుతున్నది.

- పిట్టల రవీందర్

99630 62266