
ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఇటీవలే ముగిసిన ఎన్నికల ఫలితాలు సరిగ్గా 24 గంటల తర్వాత వెలువడబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో పుదుచ్చేరి, అసోం రెండు చోట్ల భారతీయ జనతా పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈసారి గెలిస్తే అసోంలో బిజెపి హ్యాట్రిక్ కొట్టినట్టే. పుదుచ్చేరి కేవలం 30 స్థానాలతో చాలా చిన్న రాష్ట్రం కాబట్టి లెక్కల్లోకి రాదు. ఇక మిగిలింది తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ అడుగుపడాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటినుంచో తహతహలాడుతున్న విషయం తెలిసిందే.
2014 నుంచి మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చి కూడా ఈ మూడు రాష్ట్రాల్లో తాము అధికారంలోకి రాకపోవడం ఏమిటి అనే అసంతృప్తి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో నెలకొని ఉన్న విషయం అప్పుడప్పుడు స్పష్టంగా బయటపడుతూనే ఉంటుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు రెండు దక్షిణాదిలో ఉన్నాయి. కేరళలో వామపక్షాల అధికారం నడుస్తున్నది. తమిళనాట ద్రవిడ పార్టీలు జాతీయ పార్టీలను అడుగుపెట్టనివ్వని స్థితి. ఇక పశ్చిమబెంగాల్ రాష్ట్రానిది ఒక ప్రత్యేక పరిస్థితి. అక్కడ మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, బిజెపి బద్ధశత్రువు మమతా బెనర్జీ ఏలుబడిలో ఉన్నది. బంగ్లాదేశ్ సరిహద్దున ఉన్న రాష్ట్రం. 2011 నుండి 2026 దాకా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండటం, ఢిల్లీలో తమ ఏలుబడిని పదేపదే సవాలు చేస్తూ ఉండటం బిజెపికి కంటగింపుగా ఉండటం సహజం. 2021లోనే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డినా ఓటింగ్ శాతం పెంచుకోగలిగింది కానీ అధికారంలోకి రాలేదు.
అందుకే ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రయత్నాలు సాగించింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పక్షం తానే గెలిచే అధికారంలోకి రావాలి అనుకోవడం చాలా సహజం. అందులో తప్పేం లేదు. అధికారంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకోవడం కాక రాజకీయ పార్టీలకు వేరే లక్ష్యం ఏముంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా పశ్చిమబెంగాల్‌లో తాను అధికారంలోకి రావాలనుకోవడంలో తప్పులేదు. అయితే ఏ రాజకీయ పక్షం అధికారంలోకి రావాలన్నా ప్రజామోదం ఉంటే తప్ప అది సాధ్యం కాదు అన్న విషయం గుర్తించాలి తప్ప ప్రజామోదాన్ని తామే కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేయడమే అభ్యంతరకరం.
ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్టు అసోం, పుదుచ్చేరిలో బిజెపి గెలుపు బాటలో ఉన్నది. కేరళలో ఈసారి వామపక్ష కూటమి ఓటమి చవిచూసి కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ అధికారంలోకి వస్తుందని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ తమిళ నటుడు విజయ్ జోసెఫ్ అక్కడి రెండు జాతీయ పార్టీలు విడివిడిగా మద్దతు ప్రకటిస్తున్న ద్రవిడ పార్టీల భవిష్యత్తును ఊగిసలాటలో పడేసాడనే సంకేతాలు వెలువడుతున్నాయి. పశ్చిమబెంగాల్లో ఎన్నికలలో రాజకీయ పక్షాల వ్యవహారమే కాకుండా ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలుసుకోవడం కోసం పనిచేసే సంస్థల పనితీరు, వ్యవహార శైలి కూడా వివాదాస్పదం కావడం ఆశ్చర్యం కలిగించేదే కాకుండా ప్రజాస్వామ్యవాదులు అందరినీ ఆందోళనకు గురిచేసింది. రాష్ట్రాల శాసనసభలకు, లోకసభకు ఎన్నికలు జరిగిన ప్రతిసారి కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి. పోలింగ్ నాడు ఓటేసి బయటకు వచ్చిన పౌరులు కొంతమందితో మాట్లాడి వారు చెప్పిన దాన్ని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదో అంచనావేసి చెప్పే తతంగం ఎగ్జిట్ పోల్స్. జాతీయ స్థాయిలో ప్రాంతాలవారీగా అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తూ ఉంటాయి. ఒక్కొక్క సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడానికి అనుసరించే విధానం ఒక్కో రకంగా ఉంటుంది.
నిన్నమొన్నటి దాకా ఎన్‌డిటివి అనే 24 గంటల జాతీయ న్యూస్ ఛానల్ నడిపిన ప్రణయ్ రాయ్ ఎగ్జిట్ పోల్స్‌కు నిర్వహణ విషయంలో ఆద్యుడు అని చెప్పాలి. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలో ప్రసిద్ధి చెందిన మరికొన్ని సంస్థల్లో అగ్రభాగాన ఉన్నది యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ. ఈ సంస్థ నిర్వాహకుడు ప్రదీప్ గుప్తా విద్యాధికుడు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించినవాడు. 2013 నుండి ఇప్పటివరకు ఆయన 63 ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే 59 అసలు ఫలితాలతో సరిపోలడం విశేషం. బహుశా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ప్రదీప్ గుప్తా ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను మాత్రమే వెల్లడించకుండా ఆపాలని నిర్ణయించుకోవడం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. అందుకు ప్రదీప్ గుప్తా చెపుతున్న కారణాలు తప్పనిసరిగా చర్చించవలసినదే. నాలుగు మాసాలపాటు తాము ఎన్నికల సర్వేలు నిర్వహించిన క్రమంలో 60 నుండి 70 శాతం మంది ప్రజలు నోరువిప్పడానికి కూడా నిరాకరించారని, వారంతా భీతావహులై ఉన్న కారణంగానే ఓటర్లలో నిశ్శబ్దం నెలకొని ఉన్నదని ఆయన ఎక్స్ ద్వారా వెలువరించిన ఒక ప్రకటనలో అధికారికంగా పేర్కొనడం విశేషం.
యాక్సిస్ మై ఇండియా తరఫున ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్న తమ బృందంలోని సభ్యులను మమతా బెనర్జీ ప్రభుత్వం అరెస్టు చేసి 20 రోజులకు పైగా జైలులో బంధించిన కారణంగా తాము హైకోర్టుకు వెళ్లి వాళ్లను విడిపించుకోవాల్సి వచ్చిందని కూడా ప్రదీప్ గుప్తా చెప్పారు. ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున హింసాకాండ జరిగిందనీ, శాసనసభ్యులు, మంత్రులు, పెద్ద నాయకులే బయట తిరగలేని పరిస్థితులు ఏర్పడి దాడులు జరిగాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ పౌరుల మౌనం కారణంగానే తాము వేసిన అంచనాలు వెలువరించకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రదీప్ గుప్తా ఇండియా టుడే సంపాదకుడు రాజ్దీప్ సర్దేశాయ్‌తో లైవ్‌లో చెప్పారు. పశ్చిమబెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించకూడదన్న ప్రదీప్ గుప్తా నిర్ణయం మీద ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు.
తమిళనాడుకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలలో చాలా సంస్థలు డిఎంకె మరోమారు గెలవబోతున్నదని, ఒకటి రెండు సంస్థలు బిజెపి మద్దతుతో ఉన్న ఎఐఎడిఎంకె కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సినిమా నటుడు విజయ్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాబోతున్నదని ఘంటాపథంగా చెప్పగలిగిన యాక్సిస్ మై ఇండియా దాని అధిపతి ప్రదీప్ గుప్తా పశ్చిమబెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరించడానికి నిరాకరించేందుకు చూపే కారణం నమ్మదగినదేనా?
ప్రదీప్ గుప్తా చెబుతున్న కారణం నిజమే అయితే పశ్చిమబెంగాల్ ప్రజలు 60 నుండి 70 శాతం మంది అందునా ముఖ్యంగా మహిళలు ఎందుకు నోరుతెరిచి తమ అభిప్రాయం చెప్పడానికి భయపడుతున్నారు? ఓటు ఎవరికి వేస్తామో చెప్పడానికి భయపడి నోరుతెరువని వారిలో మహిళల శాతమే ఎక్కువగా ఉందని ప్రదీప్ గుప్తా స్వయంగా చెప్పారు. 15 సంవత్సరాల పాటు ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రం లో నిర్భయంగా తాము ఎవరికి ఓటేస్తున్నామో చెప్పలేని స్థితిలోకి మహిళలు ఎందుకు నెట్టబడ్డారు? తాము ఎవరికి ఓటు వేస్తామో చెప్పకుండా నిలువరించేందుకు ప్రజలను అంతగా భయపెట్టింది ఏ రాజకీయ పార్టీ? ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించడానికి నిరాకరించిన ప్రదీప్ గుప్తా ప్రజల మౌనానికి ఎవరు బాధ్యులని చెప్పదలచుకున్నారు? ఏ రాజకీయ పార్టీ వైపు ఆయన వేలు ఎత్తిచూపుతున్నారు?
పశ్చిమబెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తాము ప్రకటించడం లేదని ప్రదీప్ గుప్తా చెప్పగానే తొలుత చాలామందిలో పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నదేమో అని అనుకున్నారు. అట్లా అనుకోవడానికి కారణమేమిటంటే 2021 శాసనసభ ఎన్నికల్లో, 2024 లోకసభ ఎన్నికల్లో యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా పశ్చిమబెంగాల్ విషయంలో వేసిన ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి కాబట్టి ఈసారి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆపేసారేమో అనుకున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అనేది పశ్చిమబెంగాల్‌లో ఎంత వివాదాస్పదమైందో మనం మీడియాలో చూసాం, విన్నాం, పత్రికల్లో చదివాం. లక్షల సంఖ్యలో ఒక వర్గం ఓట్లు తొలగించి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మేలు చేసే ఉద్దేశంతో ఈ ఎస్‌ఐఆర్ నిర్వహించారని విమర్శలు వెల్లువెత్తాయి. అంతకు ముందు కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఉదంతాలు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పదేపదే గణాంకాలతో వెల్లడిస్తూనే ఉన్నారు. పరకాల ప్రభాకర్ వంటి మేధావులు 2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల తీరుమీద పలుచోట్ల మాట్లాడుతున్నారు. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎస్‌ఐఆర్ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
పశ్చిమబెంగాల్ రెండవ విడత పోలింగ్ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్‌లో ఉన్న వాళ్లను చూపించి బంగ్లాదేశ్ ముస్లింలు అని ఆరోపించడం జాతీయ టివి ఛానళ్ళు కూడా ప్రసారం చేసాయి. బంగ్లాదేశ్ నుండి లక్షల సంఖ్యలో ముస్లిం మతస్థుల చొరబాట్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నదని బిజెపి ఆరోపణ. దేశ సరిహద్దులను కట్టుదిట్టంగా కాపలా కాసే బాధ్యత కేంద్ర బలగాలది. పన్నెండేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో బాధ్యురాలిని చేయడం హాస్యాస్పదం.
యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా పశ్చిమబెంగాల్ ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను వెల్లడించకపోవడానికి చూపిన కారణాల దగ్గరికే మళ్ళీ వస్తే ప్రజలు భయంతో నోరు విప్పలేదనడం నమ్మదగినదిగా కనిపించదు. తాము ఎవరికి ఓటు వేసామో చెపితే గుర్తించి దాడులు చేస్తారని భయపడటానికి యాక్సిస్ మై ఇండియా ఆ పౌరులను వీడియోలలో ఏమీ రికార్డు చెయ్యడం లేదు. ప్రతిసారీ అన్ని సంస్థలు చేసే ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని ఏమీ లేదు. చాలా సార్లు వీటి అంచనాలు తప్పుతుంటాయి. మరి ఎవరి ఒత్తిడి కారణంగా యాక్సిస్ మై ఇండియా సంస్థ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ని వెల్లడించకూడదని నిర్ణయించుకున్నది? లోగుట్టు ప్రదీప్ గుప్తాకే ఎరుక.











