
భారతదేశం అనేక సంప్రదాయ వృత్తులకు నిలయం. గ్రామీణ సంస్కృతిలో ప్రతి వృత్తి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అలాంటి గొప్ప చేతి వృత్తులలో మేదరి వృత్తి ఒకటి. మేదరి వారు పేదవారి కలపగా పిలవబడే వెదురుతో వివిధ రకాల గృహోపయోగ వస్తువులను తయారు చేసే కళాకారులు. వీరు తయారు చేసిన వస్తువులను వీధుల్లో తిరుగుతూ లేదా వార సంతల్లో విక్రయిస్తారు. వీరిని తెలుగు రాష్ట్రాల్లో మేదరి లేదా మహేంద్ర అనే పేరుతో పిలుస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో మేధా, బురుడు, గడబ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఈ వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాదు- ఒక సాంప్రదాయ కళా సంపద. మేదరులు ప్రకృతితో మమేకమై జీవించేవారు. అడవుల్లో లభించే వెదురు వారి జీవనాధారం. వెదురును సేకరించడం నుండి అది ఉపయోగకరమైన వస్తువుగా మారే వరకు అనేక దశలు ఉంటాయి. ఈ దశలన్నింటిలోనూ మేదరి వారి అనుభవం, శ్రమ, నైపుణ్యం ఉంటుంది.
వీరు తయారు చేసే వస్తువులు గ్రామీణ జీవనంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీరు గంపలు, బుట్టలు, చాటలు, సిబ్బులు, చంద్రికలు, పొనుకలు, విసనకర్రలు వంటి వస్తువులు తయారు చేస్తారు. ఇవి తయారు చేయడానికి ముందుగా అడవిలోంచి సరైన వెదురును ఎంచుకుంటారు. దానిని పగలగొట్టిన తర్వాత వెదురును పొడవుగా చీల్చి, పలుచని పేడుగా, కర్రలు, ఓరలు, బిలుకులుగా అల్లకానికి తగినట్లుగా తయారు చేసుకుంటారు. మేదరి వృత్తి తరతరాలుగా వారసత్వంగా వస్తూ ఉంది. వీరి అల్లకం ఒక ప్రత్యేక కళా నైపుణ్యం. కాళ్లు, చేతుల, వేళ్ళ చాకచక్యంతో, ఓపికతో, శ్రద్ధతో అల్లడం ద్వారా గంపలు, బుట్టలు, చాటలు తయారు చేస్తారు. ప్రతి వస్తువు ఒక ప్రత్యేక రూపాన్ని కలిగి ఉంటుంది. గంపలు పెద్దవిగా, బుట్టలు తేలికగా, సిబ్బులు జల్లెడలు సమతలంగా ఉండేలా తయారు చేస్తారు. ఈ వృత్తిలో కేవలం శారీరక శ్రమ మాత్రమే కాకుండా కళాత్మక దృష్టి కూడా అవసరం.
ఆకృతులు, నమూనాలు, ఆకర్షణీయమైన డిజైన్లు రూపొందించడం ద్వారా వస్తువులను అందంగా తయారు చేస్తారు. కొందరు మేదరి కళాకారులు తమ ప్రతిభతో కొత్త కొత్త నమూనాలను కూడా సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియలో కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు. పురుషులు వెదురును పగలగొట్టడం, చీల్చడం వంటి పనులు చేస్తే, మహిళలు అల్లకం పనిలో నిపుణులు. పిల్లలు కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఈ కళను అభ్యసిస్తారు. తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఈ కళ సంక్రమిస్తుంది. చిన్నప్పటి నుంచే పిల్లలు ఈ వృత్తిని నేర్చుకుంటారు. అందువల్ల ఈ కళలో వారికి సహజమైన నైపుణ్యం ఏర్పడుతుంది. మేదరి మహేంద్రుల వృత్తి మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో మేదరరులు తయారు చేసిన గంపలు, బుట్టలు ఉపయోగించడం ఒక ఆనవాయితీ. వెదురుకు ఆయుర్వేద గుణాలు ఉండడం వల్ల పుట్టినపుడు చాటలో వేస్తారు. పెళ్ళిళ్ళకు వెదురు తడకలతో పచ్చటి పందిరి వేయడం ఒక సాంప్రదాయం.
మనిషి పుట్టినపట్టి నుండి చనిపోయినపుడు తీసుకెళ్లే ఏడు కట్ల పాడె సవారీ వరకు వెదురు అవసరం. కావున వెదురులు, మేదరులు సమాజంతో ముడివేసుకున్న తీరును మనం అర్థం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో ఈ వృత్తి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గత కాలంలో ప్రతి ఇంటిలోనూ, వ్యవసాయంలోనూ మేదరులు తయారు చేసిన వస్తువులే ఉపయోగించేవారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వీరి పాత్ర చాలా కీలకమైనది. కానీ కాలక్రమేణా పరిశ్రమల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్లాస్టిక్, ఇనుము, యంత్రాలతో తయారైన వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి తక్కువ ధరలకు, ఎక్కువ కాలం నిలిచేలా ఉండటంతో ప్రజలు వాటిని ఎక్కువగా వినియోగించడం ప్రారంభించారు. దీంతో మేదరి వృత్తికి డిమాండ్ తగ్గిపోయింది. మరొక ప్రధాన సమస్య వెదురు లభ్యత తగ్గిపోవడం. అడవుల తగ్గుదల, అటవీ చట్టాల పరిమితుల కారణంగా మేదరులు వెదురును సులభంగా సేకరించలేకపోతున్నారు. ఈ పరిస్థితులు వారి జీవనోపాధిని మరింత క్లిష్టంగా మార్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తి ఆదాయం తక్కువగా ఉండడంతో చాలామంది ఇతర పనులవైపు వెళ్లుతున్నారు. కొందరు కూలీ పనులు, మరికొందరు పూలు అమ్మడం, డెకరేషన్ లాంటి పనులు ఇంకొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేపడుతున్నారు. యువత కూడా ఈ వృత్తిపై ఆసక్తి చూపకపోవడంవల్ల ఈ సంప్రదాయ వృత్తి క్రమంగా తగ్గిపోతోంది. నవ కల్పనలు చేయడం, ప్రభుత్వ చొరవవల్ల వెదురు ఉత్పత్తి, వాడకం కూడా పెంచవచ్చు. ఉదాహరణకు భారతదేశంలోని మొదటి వెదురు మెట్రో స్టేషన్ బెంగళూరులోని బాంబూ బజార్ వద్ద బిఎంఆర్‌సిఎల్ వినూత్నమైన మెట్రో స్టేషన్‌ను నిర్మిస్తోంది. ఇది భారతదేశపు మొట్టమొదటి వెదురు థీమ్‌తో రూపొందుతున్న మెట్రో స్టేషన్. బెంగళూరు విమానాశ్రయం (T2) తరహాలో పర్యావరణ హితంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. దీని అలంకరణ కోసం త్రిపుర నుండి తెప్పించిన ప్రత్యేకమైన ‘బాంబూసా తుల్డా’ (Bambusa tulda) అనే వెదురు రకాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్ పరిసరాల్లోని 5 కిలోమీటర్ల రోడ్డును కూడా వెదురుతో అందంగా తీర్చిదిద్దనున్నారు. ఇలాంటి వినూత్న ఆలోచన వల్ల వెదురు కళాకారులకు ఉపాధి కలగడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు.
ఇప్పటికే జార్ఖండ్‌లో బారాబాంబో అనే పేరుతో ఒక రైల్వేస్టేషన్ ఉంది, కానీ అది సాధారణ రైల్వే స్టేషన్ మాత్రమే. బెంగళూరులో నిర్మిస్తున్నది వెదురు రూపకల్పనతో వస్తున్న ప్రత్యేక మెట్రో స్టేషన్. ఇలాంటివి భారత దేశం అంతటా విస్తరించే అవకాశం ఉంది. వెదురుతో తయారు చేసిన వస్తువులు వాడడం సమాజం బాధ్యత. ఇందుకు ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం. హస్తకళల ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా వెదురు వస్తువులను ప్రోత్సహించవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారి ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుంది. మేదరి కళాకారులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా కొత్త డిజైన్లు, ఆధునిక పద్ధతులు నేర్పవచ్చు. బ్యాంకుల ద్వారా రుణాలు, సబ్సిడీలు అందిస్తే వారు ఆర్థికంగా బలపడతారు. వెదురు వాడడం వల్ల పర్యావరణాన్ని కాపాడుతూ సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేయవచ్చు.
- బొల్లం బాలకృష్ణ
99897 35216















