
హైదరాబాద్: బహిరంగ రహదారులపై ప్రాణాపాయం కలిగించే విధంగా బైక్ స్టంట్లు చేస్తూ, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఆరుగురు నిందితులను రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అత్తాపూర్ నుండి ఆరాంఘర్ మధ్య ప్రధాన రహదారులపై కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు (స్టంట్లు) చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వీరు కేవలం తమ ప్రాణాలనే కాకుండా, పాదచారులు, ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, జిగ్-జాగ్ డ్రైవింగ్, వీల్లు వంటి స్టంట్లు చేస్తూ వాహనాల నుండి నిప్పురవ్వలు వచ్చేలా రాపిడి చేస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు ఈ ఆరుగురు నిందితులు సయ్యద్ షాహెద్ (19), షేక్ నసీర్ హుస్సేన్ (19), షేక్ జునైద్ (18), మొహమ్మద్ బిన్ ఇసా (17), అబ్దుల్ సమద్ (20), మొహమ్మద్ అర్బాజ్ హుస్సేన్ ఖాన్ (22), అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుండి నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్.టి.ఆర్ నగర్ లో మొహమ్మద్ అర్బాజ్ హుస్సేన్ ఖాన్ (22) అనే యువకుడు వాటర్ ప్లాంట్ పని చేస్తున్నాడని, అతడిపై గతంలో పోక్సో కేసు నమోదైంది. మిగిలిన నలుగురు గతంలో బహదూర్‌పురా పి.ఎస్ పరిధిలో ఇటువంటి బైక్ స్టంట్ల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ ఆపరేషన్ నిర్వహించిన డిసిపి వైభవ్ గైక్వాడ్ (టాస్క్ ఫోర్స్), రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసు బృందాలను అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ ఉండాలని, చట్టవిరుద్ధమైన, ప్రాణాపాయం కలిగించే ఇటువంటి పనులకు దూరంగా ఉండేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు సూచించారు. రహదారులపై ఎక్కడైనా ప్రమాదకర డ్రైవింగ్ లేదా బైక్ స్టంట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరడమైనది.














