రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం వెనక్కి పోతుందని అన్నారు. ప్రతిపక్షాలపై వేధింపులు తప్ప ప్రభుత్వం శాంతిభద్రలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఎంఎల్‌సి సురభి వాణిదేవితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం హోం మంత్రి బాధ్యతలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుని సిఎం రేవంత్ రెడ్డి హోం శాఖపై సమీక్ష చేయడం లేదని పేర్కొన్నారు. కెసిఆర్ హోం శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. దేశంలో మొదటిసారిగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్రంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేశారని, మల్కాజిగిరి పోలీస్ కమీషనర్ అర్ధ రాత్రి గస్తీకి వెళ్తే పోకిరీలు ఎలా వేధించారో అందరికి తెలుసని అన్నారు. తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్ చెబుతున్నాయని పేర్కొన్నారు.

2023 కంటే 2024లో 34 వేల కేసులు పెరిగాయని, రాష్ట్రంలో 18.4 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను తిట్టడానికే సిఎం సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. పెట్టుబడుల సదస్సులో రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తిడితే పెట్టుబడులు పెడతారా...? అని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి ఉన్న కరీంనగర్‌లో పట్ట పగలు గోల్డ్ షాప్‌లో చోరీ జరిగిందని, నివేదికలు తెప్పించుకునే తీరిక సిఎంకు,కేంద్ర హోం శాఖా సహాయ మంత్రికి లేదని అన్నారు. రెండేళ్ల నుంచి ప్రతిపక్ష ఎంఎల్‌ఎల క్యాంపు కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌లో బండి సంజయ్ ఉన్న సమయంలోనే గోల్డ్ షాప్‌లో చోరీ జరిగింది, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంపై బిజెపి వాళ్ళు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు,చిన్నారులపై దాడుల్లో తెలంగాణ దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో ఉందని, హైదరాబాద్ క్రైమ్ హబ్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు చలాన్లకు పరిమితం అయ్యారని అన్నారు.