
రాజకీయాల్లో అధికారాన్ని సాధించడం ఒక ముఖ్య ఘట్టం అయితే, ఆ అధికారాన్ని ప్రజల విశ్వాసంగా నిలబెట్టి తిరిగి ప్రజాతీర్పు పొందడం అసలైన నాయకత్వ పరీక్ష. ప్రస్తుతం ఈ పరీక్షను ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ల జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకశక్తిగా మారింది. రేవంత్‌రెడ్డి పలుమార్లు.. ‘నేను- మహేష్ కలిసి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం’ అనే వ్యాఖ్య ఒక రాజకీయ నినాదం కన్నా ఎక్కువే అని చెప్పక తప్పదు. అది పార్టీ- ప్రభుత్వ సమన్వయానికి ఇచ్చిన సంకేతం. పాలనలో విశ్వాసాన్ని నిర్మించడం, ఆ విశ్వాసాన్ని ఓట్లుగా మలచడం ఈ రెండు భిన్నదశలను సమన్వయం చేయాల్సిన అవసరాన్ని సిఎం రేవంత్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ధోరణిని గమనించవచ్చు. తెలుగుదేశం పార్టీ 1994 నుంచి 2004 వరకు, ఆ తర్వాత కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు, రాష్ట్ర విభజన అనంతరం బిఆర్‌ఎస్ 2014 నుంచి 2023 వరకు అధికారంలో కొనసాగాయి.
ఈ వరుసలో ప్రజలు ఒకే పార్టీకి నిరంతరంగా అధికారం ఇవ్వకుండా, కాలానుగుణంగా మార్పును కోరుకున్నారని స్పష్టమవుతుంది. అయితే ఈ మార్పు కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు.. అది పాలనపై ప్రజల అంచనాలు పెరుగుతున్నాయనే దానికి సంకేతం. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం వెనుక పదేళ్ల ప్రతిపక్ష పోరాటం ఉంది. ప్రజా సమస్యలను ఎజెండాగా మార్చిన రాజకీయ దృక్పథం ఉంది. ఇందులో రేవంత్‌రెడ్డి దూకుడు నాయకత్వం కీలకపాత్ర పోషించింది. ఆయన శైలి ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేయడంలోనే కాకుండా, ప్రజాసమస్యలను నేరుగా రాజకీయ చర్చలోకి తీసుకురావడంలో కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ దూకుడు కాంగ్రెస్ కేడర్‌లో విశ్వాసాన్ని పునరుద్ధరించింది. అయితే ఎన్నికల గెలుపును నిలబెట్టేది కేవలం దూకుడు కాదు. అది సంస్థాగత బలం, అంతర్గత సమన్వయం, కేడర్ స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మహేశ్ కుమార్ గౌడ్ పాత్ర కీలకంగా మారింది.
టిపిసిసి అధ్యక్షుడిగా ఆయన బాధ్యత కేవలం పార్టీ నిర్వహణ కాదు అది అసంతృప్తులను సమతౌల్యంతో పరిష్కరించడం, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేడర్‌ను చురుకుగా ఉంచడం, నాయకుల మధ్య సమన్వయాన్ని నిలబెట్టడం.ఘర్షణకంటే సమన్వయానికి దగ్గరగా ఉండే ఆయన శైలి ప్రస్తుతం కాంగ్రెస్‌కు అవసరమైన సంస్థాగత స్థిరత్వాన్ని అందించే అవకాశం కల్పిస్తోంది. ఇద్దరి నాయకత్వ శైలులు పరస్పరం విభిన్నమైనవే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బలం ఇదే. రేవంత్ వేగం అయితే, మహేశ్ స్థిరత్వం. ఒకరు ప్రభుత్వానికి ప్రజా ముఖచిత్రం అయితే, మరొకరు పార్టీకి వెన్నెముక. ఈ ఇద్దరి నాయకత్వం సమన్వయంతో పనిచేస్తే అది కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మక ఆధిక్యాన్ని ఇస్తుంది. ఇక్కడే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు పాలనలో కనిపించకపోతే ప్రజా విశ్వాసం తగ్గిపోతుంది.
ప్రజలు నినాదాలను కాదు, ఫలితాలను గుర్తుంచుకుంటారు. అందుకే రేవంత్- మహేశ్ జోడీకి ప్రధాన సవాల్ పాలనలో స్పష్టమైన ఫలితాలు చూపించడం. సంక్షేమం మాత్రమే కాదు, పరిపాలనలో పారదర్శకత కూడా అంతే ముఖ్యం. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుకు సాగు భరోసా, పట్టణాభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతులు ఇవి అన్నీ కలిసి ప్రజాతీర్పును ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వం ఎంత పని చేసిందన్నది కంటే, ప్రజలు ఎంత అనుభవించారన్నదే ఎన్నికల్లో ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు కూడా తమ వ్యూహాలను పదును పెడుతున్నారు. బిజెపి తెలంగాణలో తన స్థాయిని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. బిఆర్‌ఎస్ తిరిగి పునరుద్ధరణ కోసం కసరత్తు చేస్తోంది. ఈ రెండు శక్తుల మధ్య కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం ప్రభుత్వ పనితీరు సరిపోదు పార్టీ అంతర్గత ఐక్యత కూడా అంతే కీలకం.
నాయకుల మధ్య విభేదాలు, స్థానిక స్థాయి అసంతృప్తులు, టికెట్ ఆశావహుల పోటీ, పదవుల సమీకరణ ఇవి అధికార పార్టీలకు సహజ సవాళ్లు. వీటిని ముందుగానే సమన్వయం చేయకపోతే ఎన్నికల సమయంలో అవే బలహీనతలుగా మారుతాయి. ఇక్కడే టిపిసిసి అధ్యక్షుడి పాత్ర మరింత పెరుగుతుంది. రేవంత్‌రెడ్డి చెప్పిన నేను- మహేష్ కలిసి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం అనే మాట వెనుక అసలు భావం ఇదే. ఇది వ్యక్తిగత స్నేహం గురించి కాదు పార్టీ -ప్రభుత్వ సమన్వయ రాజకీయ తత్వం గురించి. ఒకరు పాలనలో ప్రజా విశ్వాసాన్ని గెలుచుకోవాలి, మరొకరు సంస్థాగతంగా ఆ విశ్వాసాన్ని ఓట్లుగా మలచాలి. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ బలమైన నాయకత్వాన్ని కోరుకుంటారు. అదే సమయంలో అందుబాటులో ఉండే, మాట నిలబెట్టుకునే నాయకత్వాన్ని మరింతగా ఆదరిస్తారు. కాంగ్రెస్ ఈ రెండు లక్షణాలను సమన్వయం చేయగలిగితే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు బలపడతాయి. రాజకీయాల్లో విజయానికి కేవలం నినాదాలు సరిపోవు వాటిని నిలబెట్టే కార్యాచరణ అవసరం. రేవంత్ రెడ్డి- మహేశ్ కుమార్ గౌడ్ జోడీ ఇప్పుడు ఆ కార్యాచరణకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ జోడీ ప్రజల ఆశలను నెరవేర్చగలిగితే, తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి చరిత్ర సృష్టించడం అసాధ్యం కాదు.
- అమరవాజీ నాగరాజు
(టిపిసిసి చీఫ్ పిఆర్‌ఒ)














