
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని బిఆర్ఎస్ మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సంగారెడ్డి: కందిలోని సెంట్రల్ జైల్లో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు వంతపాడుతున్న అధికారులను వదిలిపెట్టమని, నేను రాజు.. నేను మంత్రి అన్నట్లుంది రేవంత్ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ అడుగుతారా అనే అహంకార పూరిత దోరణితో వ్యవహరిస్తుందని, విజిలెన్స్, సిఐడి, కమిషన్లు, అక్రమ కేసులు, అరాచకాలను పాల్పడుతున్నారని మండిపడ్డారు. మన్నె క్రిశాంక్ పిఎస్ లో ఫిర్యాదు చేశారని, మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడని, అందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన మొబైల్ ను అందజేశారని అన్నారు.
తప్పుడు వార్తలు రాసినోళ్లను కాకుండా ఫిర్యాదు చేసినోళ్లనే అరెస్టు చేశారని, ఫేక్ పోస్టులు పెట్టినోళ్లకు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపారని మండిపడ్డారు. క్రిశాంక్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని, నాన్ బెయిలబుల్ సెక్షన్లను మేజిస్ట్రేట్ కొట్టి వేసిందని తెలిజేశారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటపెట్టడమే నేరమా? అని హరీష్ రావు ప్రశ్నించారు. అనుముల మహానందరెడ్డి ఓ కేసులో తలదూర్చాడని, అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తే క్రిశాంక్ పై కేసు పెట్టారని అన్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడే స్వయంగా ఫిర్యాదు చేశారని, తప్పుడు కేసులు పెడుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, కేసులతో గెలుస్తామనుకోవడం మూర్ఖత్వం అని రేవంత్ రెడ్డి హిట్లర్ ను మించిపోయారని దుయ్యబట్టారు. ఐఎఎస్ అధికారులు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, తమ ఇండ్ల ముందు ఉండే సిసి కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఐఎఎస్ అధికారులను హెచ్చరిస్తున్నామని..బిఆర్ఎస్ దగ్గర అన్ని ఆధారాలున్నాయని, రిటైర్ అయినా కాంగ్రెస్ వాళ్లని వదిలి పెట్టమని హెచ్చరించారు. చట్టం నుంచి ఐఎఎస్ అధికారులైనా తప్పించుకోలేరని, తమ పార్టీ కార్యాలయంలో అన్ని రికార్డు అవుతున్నాయని తెలియజేశారు. రేవంత్ మాటలకు ఎక్కవ..చేతలకు తక్కువ అని 420 హామీలు ఏమయ్యాయని, రైతులు ఎంతో బాధతో ఉన్నారని, కొనుగోలు కేంద్రాలల్లో రైతులు పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగలు, మక్కలు కొనే దిక్కులేక, బయట అమ్ముకుంటున్నారని, వడ్డ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, కొనే దిక్కు లేక రైతులు ఎండలో మాడిపోతున్నారని అన్నారు.
4-5 కిలోల తరుగు తీస్తున్నారని, బోనస్ ఓ బోగస్ అని జొన్న రైతులు ఎంతో ఇబ్బందిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో వడ్డకు బోనస్ ఇస్తావా? ఇవ్వవా? అని రైతులను పట్టించుకోవా? అని ప్రశ్నించారు. ఇవ్వకపోతే రైతులకు క్షమాపణ చెప్పు అని అన్నారు.ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేయ్ రైతులను పట్టించుకో అని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావని పిటి వారెంట్లతో క్రిశాంక్ ను జైల్లో ఉంచేలా కుట్ర చేశారని మండిపడ్డారు. రెండున్నరేళ్లయినా మంచిగా పనిచేయ్ అని సూచించారు. రేవంత్ మళ్లీ గెలిచేది లేదని, ప్రజల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని హరీష్ రావు హామీ ఇచ్చారు.













