
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఆదివారంనాడు జరిగిన హత్యాయత్నంపై ప్రపంచమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ హత్యాయత్నానికి దారి తీసిన కారణాలపై చర్చ తీవ్రంగా జరుగుతోంది. అమెరికాలో రాజకీయ హింస అనేది కొత్తేమీ కాదు. ఆ దేశచరిత్రలో తుపాకీ సంస్కృతి ఒక భాగమై పోయింది. రిపబ్లికన్ అధినేత అబ్రహం లింకన్ 1865లో హత్యకు గురికాగా, అప్పటి నుంచి 1963లో జాన్ ఎఫ్. కెన్నడీ వరకు అధికారంలో ఉన్న నలుగురు అధ్యక్షులు హత్యకు గురయ్యారు. 2007 కాంగ్రెసనల్ రీసెర్చి సర్వీస్ నివేదిక ప్రకారం ప్రభుత్వ అధినేతలుగా ఉన్న 45 మంది ప్రముఖుల్లో 10 మందిపై ప్రత్యక్ష దాడులు జరిగినట్టు తేలింది. ఇక హత్యాయత్న వైఫల్యాలు, బెదిరింపులు తదితర సంఘటనలు 30కి పైగా జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా 2024లో కూడా ట్రంప్‌పై రెండుసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఈ సంఘటనను రిపబ్లికన్లు, డెమోక్రాట్లు తమ రాజకీయ ప్రయోజనాలకు అన్వయించుకుంటున్నారు. ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్లు ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా విమర్శిస్తుండగా, ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రేరేపించడం, ద్వేషపూరిత హెచ్చరికలు ఇవే ట్రంప్‌పై దాడికి కారణమవుతున్నాయని డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ మాటలు యుద్ధనేరాలని, నరమేధాన్ని ప్రోత్సహిస్తున్నాయని చట్టసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్రంప్‌ను పదవినుంచి వెంటనే తొలగించాలని, 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించాలని గతంలో కూడా డెమోక్రాట్లు డిమాండ్ చేయడం గమనార్హం. మొత్తం మీద రానున్న నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ హత్యాయత్నం జరగడం రాజకీయంగా ఎవరికి లాభం? అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. కాల్పుల తరువాత ట్రంప్‌పై సానుభూతి పెరిగి రేటింగ్ లభిస్తుందని రిపబ్లికన్లు ఆశిస్తుండగా, ఇరాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరు ఆయనకే నష్టం కలిగిస్తుందని, ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా ట్రంప్ మరోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమేమిటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది. 1765 1783 మధ్య అమెరికా విప్లవ పోరాటంతో ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన అమెరికా రక్తపాతంతో కూడిన అంతర్యుద్ధాన్ని చూసింది.
1960లో సామాజిక సంఘర్షణలు సంభవించాయి. సామాజిక న్యాయం, ప్రాంతీయ గుర్తింపు, భూమికోసం పోరాటాలు జరిగాయి. ఇవి ఆయా సమయాల్లోని వ్యవస్థాగత లోపాలపై నిరసనగా వచ్చాయి. ఇప్పుడు ఆందోళనలు, సంఘర్షణలు రాజకీయ ప్రేరేపితం, తీవ్రమైన ధ్రువీకరణలతో సోషల్ మీడియా ప్రభావంతో హింసాత్మక సంఘటనలుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయ లక్షాలను సాధించడానికి హింసామార్గాన్ని అవలంబించడం సాధారణమవుతోంది. రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. 2016 నుంచి రాజకీయ నాయకులపై దాడులు, బెదిరింపులు, ద్వేష ప్రసంగాల విద్వేషాలు పెచ్చరిల్లాయి. 2025 26 మధ్యకాలంలో ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు, ట్రంప్ సన్నిహితుడు, కరడుకట్టిన జాతీయవాది చార్లీకిర్క్ (31) తుపాకీ కాల్పులకు బలయ్యాడు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో క్యాపిటల్ హిల్ అటాక్ తర్వాత రాజకీయ నాయకులను లక్షంగా చేసుకుని హింసాత్మక దాడులు సాగించడం బాగా పెరిగింది.
ప్రస్తుతం ఎటువంటి అధికారిక సంస్థలతో సంబంధం లేని వ్యక్తులు ఇంటర్నెట్ ద్వారా తీవ్రవాదులుగా మారి హింసకు పాల్పడుతున్నారు. గతంలో రాజకీయ మార్పుల కోసం హింసాత్మక సంఘటనలు జరిగినా, ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ విభజన, విద్వేషం కారణంగా దాడులు తీవ్రమవుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ హింసకే ఆందోళనకర స్థాయిలో మద్దతు ఉన్నట్టు బయటపడుతోంది. ప్రతి పదిమంది అమెరికన్ ఓటర్లలో ఆరుగురు కేవలం భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నారనే కారణంతో కొంతమందిని ద్వేషిస్తున్నారు. పార్టీ పరంగా చూస్తే డెమోక్రాట్లలో 51 శాతం మంది, రిపబ్లికన్లలో 39 శాతం మంది రాజకీయ హింసకే మద్దతు పలకడం గమనార్హం. తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి హింస తప్ప వేరే మార్గం లేదన్న అభిప్రాయాన్ని వీరు వెలిబుచ్చారు. ట్రంప్ రెండోసారి పదవీ కాలంలో చార్లీ కిర్క్ హత్య వంటి సంఘటనలు జరుగుతాయని డెమోక్రాట్లలో 53 శాతం అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ వాతావరణం ప్రశాంతంగా, నాగరిక నాయకత్వంలో ఉండాలని కోరుకునే అత్యధికుల్లో ఒక చిన్నవర్గం నుండి వస్తున్న హింసాత్మక ప్రతిస్పందన ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్‌కు తలొగ్గి అనవసరంగా ఇరాన్‌పై యుద్ధానికి కాలుదువ్విన అధ్యక్షుడు ట్రంప్‌పై ఆయన మద్దతుదారుల్లోనే ఆగ్రహం రగిలిస్తోంది. కొంతమంది రిపబ్లికన్లు, ఇండిపెండెట్లు ట్రంప్‌కు దూరమయ్యారు. ట్రంప్ తన యుద్ధోన్మాదం వదులుకుంటేనే వారు తిరిగి ట్రంప్ గూటిలోకి చేరే అవకాశం ఉంటుంది. అలా జరిగితేనే తిరిగి అధ్యక్షునిగా ట్రంప్ అధికారం చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. ట్రంప్ ఈ విషయంలో తన వైఖరి మార్చుకోకుంటే కాంగ్రెస్‌ను డెమోక్రాట్లు నియంత్రించ గలుగుతారు. రిపబ్లికన్లు నష్టపోతారు. రిపబ్లికన్లు ఈ అంచనాను నమ్మడం లేదు. డెమోక్రాటిక్ పార్టీ ట్రంప్‌పై ఇరాన్ యుద్ధ ముద్రవేసి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ఈ కారణంగానే హత్యాయత్నానికి యువ వామపక్ష కార్యకర్త ఉగ్రవాదిలా మారాడని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ప్రధాన స్రవంతి మీడియా కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగానే ప్రచారం సాగిస్తోందని తప్పును పడుతున్నారు.














