ఉమర్!

నీ కోసం నేను కవితలు రాయలేను

నన్ను నీకు కథలు చెప్పనీ

రూపం లోనూ,సారం లోనూ

పరిణామాలు చెందే కథల్ని

చూడు, మన వసంతం వెళ్ళిపోయింది

వేసవి వొడిలో, నదులన్నీ మన అత్యాసకి

ప్రేతాత్మలుగా మారిపోయాయి

అడుగడుగునా కొత్తవి, తాజావీ అయిన

స్వంత ఆస్తులను సూచించే

వీధి బోర్డులు వెలిశాయి

చేపలన్నీ ఎటు పోయాయో మరి?

చెట్లను రక్షిద్దాం అనే పేరున్న ఫలకాలు

బాగా కండ పుష్టితో బలిసి ఉన్నాయి

తెల్లని వాటి కళ్ళు కడుపు నిండా తిని

త్రేన్చిన సంప్తృప్తితో మెరుస్తున్నాయి

తరువాత ఒక పొడవైన తాఖీదు

వాటికి చదివి వినిపిస్తారెవరో

అవునూ ఉమర్?

చచ్చిన చేపలకి చెవులుంటాయా ఏంటి?

చూడెట్లా బాహుమూలాలు గీసుకున్నట్లు

వాళ్ళు చెట్లను చెక్కేసారో

శుభ్రంగా తవ్వబడిన నేల కూడా రోజూ

బద్దలయ్యే అగ్నిపర్వతంగా మారిపోతుంది

ఇక గత వెయ్యి రోజులుగా

పార్లమెంట్ నటులే లేని

ఒక రంగస్థలంగా మారిపోయింది

ఇక మేమంతా,ప్రశ్నించే మా నాలుకలకి

కనిపించని సంకెళ్ళతో, గోదాముల్లో నిలువ చేసే ఖైదీలుగా మారిపోయాము

విచిత్రంగా ఈ మే నెలలో

నా కూతురు ఒక ప్రశ్న అడిగింది

ప్రభుత్వాన్ని షాజహాను నడుపుతున్నాడా

ఏంటమ్మా అంటూ!

ఉమర్!

నాకు తెలిసిన వాళ్ళనల్లా అడిగాను

ఈ నీలి గీతలున్న మెట్రో రైలు నన్ను

నువ్వున్న తీహార్ జైలుకు తీసుకు వెళ్లగలదా అని

నీకెలా ఉత్తరాలు రాయగలనో చెప్పు?

నేనా,జైలులో బందీని

నువ్వొక స్వేచ్ఛా జీవివి

నేను ఎప్పటికైనా నీకు ఉత్తరం రాయగలనా

ఉమర్ చెప్పు?

నిన్ను చేరుకోగలిగీ, ఎన్నటికీ చేరుకోలేను ఇక

నా స్వప్నాలన్నీ సర్కారు ఒప్పందాలుగా

రూపాంతరం చెందాయి

ఇక నువ్వు? నా కామ్రేడ్,

నీ కలల్ని సజీవంగానే

ఉంచుకుని ఉంటావులే

అందుకే ఈ రాత్రి నేను నీకు రాసే లేఖలో విషాద వాక్యాలు రాయలేను

నా కలలు నాకు తిరిగి దక్కడానికి

నీ కోసం నిరీక్షిస్తున్నాను

ఉమర్! నీకు నువ్వే

ఒక ప్రతిఘటనగా రూపాంతరం చెందాక

నేను నీకు గొంతుగా మారిపోయాను

ఇక ఆ సూర్యుని వేడి నీటిని కుండపోత వర్షంగా మార్చివేస్తుందన్న సత్యం మనిద్దరికీ తెలుసు

అందుకే కదా ఉమర్

నీకు కవిత్వం కాకుండా రూపాంతరం చెందిన కథలు కొన్ని చెబుతానన్నది

- ఉమర్ ఖాలిద్ కోసం ఒక కవిత

ఇంగ్లీష్ మూలం మౌమితా ఆలం

అనువాదం గీతాంజలి