
మన తెలంగాణ/మోత్కూర్: గత ప్రభుత్వ హయాంలో సాదా బైనామా క్రింద భూమి పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ భారతి ద్వారా వెంటనే పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం మండల కార్యదర్శి దడిపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. అనాదిగా సాగులో ఉన్న భూములకు కూడ ఇప్పటికి పట్టా హక్కులు లేకపోడం బాధాకరమైన విషయమని అన్నారు. గత ప్రభుత్వం సాదా బైనామా ధరఖాస్తులను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడ ఆశలు చూపిస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. మండలంలోని వివిధ గ్రామాలలో వందల ఎకరాలు సాగులో ఉన్నప్పటికీ రైతులకు హక్కులు లేవని గుర్తుచేశారు. వెంటనే సాగు చేసుకుంటున్న రైతులకు భూబారతి ద్వారా హక్కులు కల్పించి, పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు వరి దాన్యాన్ని కళ్లాలో పోసి కొనుగోలు కోసం పడిగాపులు పడుతున్నారని, అదునుగా బావించిన మిల్లర్లు తాలు తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. వెంటనే దోపిడీని అరికట్టి కొనుగోలు వేగవంతం చేసి మద్దత్తు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభాకర్ కోరారు.














