
మన తెలంగాణ/హైదరాబాద్: సాదా బైనామాల దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కరే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరిం త వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీఓలకే అధికారాలను ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అత్యం త ప్రాధాన్యత ఇవ్వాలని
జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సోమవారం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జిల్లాల ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారు లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా హౌసింగ్ , రెవెన్యూ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు ప్రస్తావించిన అంశాలపై అక్కడికక్కడే స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణం నిరంతరం ప్రక్రియ గతంలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకొని వారు, ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచనలను, సలహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో విస్తృతంగా భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, ఆయా లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు. వివిధ కారణాలతో ఇళ్లు నిర్మించుకోలేని వారు, తమకు ఇల్లు అవసరం లేదని తెలియచేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని మంత్రి సూచించారు.
తక్షణమే బిల్లులను విడుదల చేయాలి
ఇంటిబేస్ మెంట్ నిర్మాణం పూర్తి అయిన తరువాత లక్ష రూపాయలు మంజురు చేశాక, వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రాని వారికి తక్షణమే బిల్లులను విడుదల చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. పేదవారి అభివృద్ధి సంక్షేమం విషయంలో అధికారులు మానవతా ధృక్పథంతో వ్యవహారించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అక్కడక్కడా నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయాలని, అలాగే త్రాగునీరు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించాలని, ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా జి ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లను నిర్మించుకునేలా వెసులుబాటు కల్పించామని ఆయన చెప్పారు.
భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం
భూసర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత సర్వే మ్యాప్ నెంబరు, భూదార్ నెంబర్‌ను కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని తొలివిడతలో శిథిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రతిజిల్లా కేంద్రంలో ఆధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ సమావేశాల్లో నిజామాబాద్ ఇంఛార్జి మంత్రి శ్రీమతి దాసరి అనసూయ (సీతక్క), ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి జి.వివేక్, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఆయా జిల్లా ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, హౌసింగ్ సెక్రటరీ విపి గౌతం తదితరులు పాల్గొన్నారు.












