మన తెలంగాణ/హైదరాబాద్: నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) ఛైర్మన్ అనిల్ జైన్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేలా య త్నించిన ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి బం డి సంజయ్ బుధవారం తన మంత్రివర్గ స హచరుడైన కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు లేఖ రాశారు. చైర్మన్ అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్‌కు రాసిన లేఖను బండి సంజయ్ కార్యాలయం రహస్యంగా ఉంచింది. కాళేశ్వరం విషయంలో అనిల్ జైన్ వ్యవహారశైలి 

ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై అనిల్ జైన్ భాగస్వామి కావడమేంటి? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద వెయ్యి బోర్ హోల్స్ తవ్వాలని ఎన్డీఎస్ నివేదిస్తే... అందుకు భిన్నంగా 100 బోర్ హోల్స్ తవ్వితే సరిపోతుందని చెప్పడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ సూచించిన పరీక్షలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బ్యారేజీల స్థితిపై భూగర్భ, భూభౌతిక పరీక్షలు నిర్వహించాని సూచించి రెండేళ్లయినా పురోగతి లేదని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలో కేవలం 6 బోర్ హోల్స్ మాత్రమే పూర్తి చేసిందని ఆయన తెలిపారు. అన్నారం, సుందిల్లలో ఒక్క బోర్ హోల్స్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మే చివరి నాటికి బోర్ హోల్స్‌ను పూర్తి చేయాలని సూచించినా పట్టించుకోవడం లేదని, నిర్ణీత గడువులోగా బోర్ హోల్స్ పూర్తి చేయలేమని గ్రహించి ఎన్డీఏస్ ఛైర్మన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆయన ఆరోపించారు.

బోర్ హోల్స్ సంఖ్యను 100కు పరిమితం చేసి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డను సందర్శించారని, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అనిల్ ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ కమిటీ నిర్ణయాలను ఒక వ్యక్తి ఎలా అధిగమిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే చైర్మన్ అనిల్ జైన్‌పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో బ్యారేజీలకు మరింత నష్టం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్‌డిఎస్‌ఏపై నిందలు మోపే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి లోనై ముందుగా కమిటీ ఇచ్చిన సిఫార్సులను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.