
మన తెలంగాణ/హైదరాబాద్‌ః చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల కోసం ఐదు ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల మూలంగా నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే టర్మినళ్లపై అధిక భారం పడుతున్నదని ఆయన తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రూ. 430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, దానికి ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది జనవరి 6న ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో మీరూ పాల్గొన్నారని ఆయన తెలిపారు.
కొత్త రైల్వే టర్మినల్ ను ప్రారంభించుకున్న తర్వాత రోజూ కొన్ని పదుల సంఖ్యలో రైళ్లు చర్లపల్లి నుంచి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దీంతో, ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రైల్వేస్టేషన్‌కు వెలుపల ఇరువైపులా ప్రయాణికులు, వాహనాలు రైల్వేస్టేషన్‌కు సులభంగా రాకపోకలు సాగించటానికి వీలుగా అప్రోచ్ రోడ్లను విస్తరించవలసిన అవసరం ఉందని, అదేవిధంగా పార్కింగ్ తదితర అవసరాల కోసం స్టేషన్ కు ఇరువైపులా అవసరమైన భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని ఆయన వివరించారు.
ఎఫ్‌సిఐ గో-డౌన్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించాల్సి ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఈ రహదారి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించటానికి ప్రధాన రహదారిగా మారనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. భరత్ నగర్ వైపు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కగా) నుంచి చర్లపల్లి స్టేషన్‌కు వచ్చే 30 అడుగుల రహదారిని కనీసం 100 అడుగుల వెడల్పుతో విస్తరించాల్సి ఉందని ఆయన వివరించారు.
ఇసి నగర్ నుంచి చర్లపల్లి స్టేషన్‌లోని ఎంఎంటిఎస్ ప్లాట్ ఫాంను చేరుకునే రోడ్డు చాలా ఇరుకుగా ఉన్నందున ఈ రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవున విస్తరించవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
వీటితో పాటుగా చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటిఎస్ ప్లాట్ ఫాం వైపు 2.70 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం కేటాయించాల్సి ఉందని ఆయన వివరించారు. చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్ ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం రూ.4 కోట్ల నిధులను కూడా రైల్వే శాఖ జమ చేసినందున, త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని ఆయన కోరారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని రూ. 715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్ ను చేరుకోవడానికి ఇప్పుడు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉందని, ప్రయాణికులు సాఫీగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఆల్ఫా హోటల్ నుంచి రతిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలని కోరారు.
ఈ విషయాన్ని తాను లోగడ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022 జూన్ 15న, ఆ తర్వాత 2023 మార్చి 7న రెండు ఉత్తరాలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 2024 సెప్టెంబర్ 8న మీకు కూడా ఉత్తరం రాశానని అయినా ఈ విషయంలో ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాలేదని ఆయన పేర్కొన్నారు.
అధికారుల బృందం రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్లను పరిశీలించినా ఇంత వరకు ఎలాంటి ఫలితం లేదని ఆయన తెలిపారు. కాబట్టి ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, నగరానికి ఎంతో అవసరమైన చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయించాలని, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కోరారు.













