ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ “ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు.. మేము దానికి అంగీకరిస్తాం. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని మీరు దయచేసి గ్రహించండి. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం.

ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. కానీ, మేము ఒక్కరిమే మా ప్రయోజనం మేము చూసుకొని వెళ్ళిపోతాము అనడం సరైనది కాదు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావు. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. చర్చించుకొని పరిష్కరించుకుందాం. ’హరి హర వీరమల్లు’ విడుదల సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందాం. నాలుగైదు నెలల నుంచి సరైన సినిమా లేక అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు.

సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం”అని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఎకో సిస్టమ్ లో ఒకరు బాగోకపోతే ముగ్గు రూ బాగోరు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురూ బాగాలేరు. ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల పరిస్థితి బాలేదని చెప్పారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని, ఫలానా తేదీ చివరి రోజు అంటూ బెదిరించినట్టుగా మాట్లాడకండి. ఇక్కడ ఉన్న నిర్మాతలవి 50 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిన సినిమాలు కనీ సం 25 ఉన్నాయి. వీటిలో చిన్న, పెద్ద అన్ని సినిమాలు ఉన్నాయి.

ఇప్పటికే 70-, 80 శాతం బడ్జెట్ ఖర్చు పెట్టి ఉన్నాము. ఇలాంటి సమయంలో కొత్త విధానం తీసుకొస్తామంటే అది సబబుగా ఉండదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో ఆ విధానాన్ని అంగీకరించలేము. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానంపై ఆలోచిస్తాము. కానీ, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. థియేటర్ల గ్రేడింగ్, మెయింటనెన్స్ ఛార్జ్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించిన తర్వాత.. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి వెళ్ళడంలో మాకు అభ్యంతరం లేదు. ఇతర రాష్ట్రాల్లో పర్సెంటేజ్ విధానం అమల్లో ఉంది అంటున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ఎవరి పరిస్థితి బాలేదు. వాళ్ళకంటే మనమే మెరుగైన స్థితిలో ఉన్నాము. అలాంటిది మనం వెనక్కి వెళ్లడం ఎందుకు?. ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యం కదా. అలాంటిది డిస్ట్రిబ్యూటర్ ను చంపేసి, ఎగ్జిబిటర్ ను కాపాడాలి అనడం ఎంతవరకు కరెక్ట్?. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది”అని తెలిపారు.