
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల అభ్యర్థన ను మన్నిస్తూ, ఆర్టీసి ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలను పరిష్కరిస్తామన్న తీపి కబురు అందించారు. ఇటీవల ఆర్టీసి కార్మికు లు చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను వెంటనే చెల్లించాల ని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతోపాటు సమ్మె సమయంలో కార్మికులపై నమోదైన పోలీ సు కేసులను కూడా పూర్తిగా ఎత్తివేయాలని సిఎం ఆదేశించారు. కార్మిక సంఘాల నాయకు లు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,
సంబంధిత ఉ న్నతాధికారులను సిఎం ఆదేశించారు. వేతనా ల చెల్లింపు, కేసుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసి కార్మిక సంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించినందుకు సిఎంకు కార్మిక సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపిలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సిఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసి ఎండి వై నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అందరం కలిస్తేనే ప్రభుత్వం
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి కార్మికులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి ఉద్యోగుల బకాయిలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఈ సారి ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల చేశామని, ఆర్టీసి సమస్యలను 100 శాతం పరిష్కరిస్తామని, కార్మికులతో ప్రభుత్వం ఉంటుందని, సంస్థ ఆగిపోతే ఊపిరిపోయినట్లేనని, సంస్థకు నష్టం జరిగే పనులు చేయొద్దని కార్మికులు, ఆర్టీసి యాజమాన్యం మధ్య స్నేహా పూర్వక వాతావరణం ఉండాలని, ప్రభుత్వం ఆర్టీసి కార్మికుల హక్కులను కాపాడుతుందని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు.
సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సేవలు అందించడానికి కార్యాచరణ కోసం ముందుకు వచ్చినందుకు సిఎం రేవంత్‌రెడ్డి కార్మిక సంఘాల నాయకులను అభినందించారు. తాను వేరు, మీరు వేరు అన్న భావన తనకు ఎప్పుడు లేదని, అందరం కలిస్తేనే ప్రభుత్వమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసి కార్మికులు కోరుకున్నారని, ఆర్టీసి కార్మికుల పోరాటాల్లో తాము ఉన్నామని, ఆర్టీసిలో బస్సులను పెంచామని, నియామకాలను పెంచామని, ఆదాయాన్ని కూడా పెంచామని సిఎం రేవంత్‌రెడ్డి కార్మికులతోపేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసి దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచిందన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్ నిర్మిస్తాం
గాజులరామారంలో బస్ టర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించామని, శంషాబాద్ లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్ నిర్మిస్తామని, 1,000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసికి అందజేయాలనుకుంటున్నామని, డీజిల్ పైన ఆర్టీసికి ప్రతి ఏడాది రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తుందని, డీజిల్ ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ బస్సులను తీసుకురావాలని, ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాలని, దీని కోసం పక్కా ప్రణాళిక కావాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆర్టీసిలో బకాయిలు తమ హయాంలో పెట్టినవి కావని, కానీ వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పెండింగ్‌లో కారుణ్య నియామకాలను తాము చేపట్టామని, ఆర్టీసి సమస్యలు ఏమైనా న దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు.
కార్మికులు, డిపో మేనేజర్ల మధ్య
గ్యాప్ రాకుండా అధికారులు చూడాలి
యూనియన్లు, విలీనం లాంటి అంశాలపైన ప్రణాళిక బద్దంగా కార్మిక సంఘాలే చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆర్థిక అంశాలతో కూడిన పీఆర్సీ లాంటి సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, శాశ్వత పరిష్కారం కోసం చర్చించుకొని ప్రభుత్వం ముందు ఆప్షన్స్ పెట్టాలని, రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని, ఆర్టీసి అప్పుల పైన ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. సంస్థలను బలోపేతం చేసుకొని నిలబెట్టుకోవడానికి కార్మికులు సహకరించాలని ఆయన సూచించారు. ఆర్టీసిలో ఒక్క డ్రైవర్‌ను కూడా తగ్గించమని, డీజిల్ ఖర్చు తగ్గించడానికే ఈవీ బస్సులను ప్రోత్సహిస్తున్నామని, మహాలక్ష్మీపథకం పెట్టడం ద్వారా రూ.8 వేల కోట్లను ఆర్టీసికి ఇచ్చామని ఆయన తెలిపారు. ఆర్టీసిని బాగు చేసుకునే అవకాశం కార్మికులపైనే ఉందని, కార్మికులు, డిపో మేనేజర్ల మధ్య గ్యాప్ రాకుండా అధికారులు చూడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.













