మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి కార్మిక సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. అన్ని చోట్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్థరాత్రి నుండి కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కాగా బస్‌స్టేషన్‌లు బస్సులు లేక వెలవెల బోయాయి. డిపోల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె కారణంగా బస్సులు తిరగక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిని అదనుగా భావించి ప్రైవేటు వాహనాలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల అద్దె బస్సులను పోలీసు ఎస్కార్ట్‌తో తిప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 లోపు అద్దెబస్సులు మాత్రమే పోలీసు బందోబస్తుతో నడిచినట్లు ఆర్‌టిసి వర్గాలు వెల్లడించాయి. ఆర్‌టిసిలో మొత్తం 10 వేల బస్సులు ఉండగా వీటిలో మూడున్నర వేల అద్దె బస్సులు ఉన్నాయి. ఉదయం నుంచే కార్మికులు డిపోల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా వారు అడ్డుకున్నారు. హైదరాబాద్ నగరంలోనూ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసి నాయకులు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళు లర్పించి గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. అన్ని డిపోల ముందు మహా ధర్నాకు వారు పిలుపునిచ్చారు. మరోవైపు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రయాణీకుల శ్రేయస్సు దృష్టా కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కార్మికులు మాత్రం తమ డిమాండ్లు నెరవ్చేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమ్మెను మన్నుందు మరింత ఉధృతం చేస్తామని జెఎసి నేతలు ప్రకటించారు.

సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్‌టిసి సూపర్ వైజర్ అసోసియేషన్

ఆర్‌టిసి కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఎఎస్‌ల కమిటీని సూపర్ వైజర్ అసోసియేషన్ స్వాగతించింది. ప్రజా పాలన ప్రభుత్వానికి, ఆర్‌టిసి ఎండికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వం ఆర్‌టిసి సమస్యలపై చాలా సానుకూలంగా ఉందని, త్వరలో అన్ని సమస్యలపై పరిష్కారం అవుతాయన్న విశ్వాసం ఉన్నందున సూపర్ వైజర్ అసోసియేషన్ సమ్మెలో పాల్గొనడం లేదని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.వాసుదేవ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

సమ్మె నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసులు పెంపు

ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ప్రయాణీకుల సౌకర్యార్థం మెట్రో రైల్ సర్వీసులు పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైళ్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీని గరిష్ట స్థాయికి పెంచాలని నిర్ణయించినట్టు పేర్కొంది. రద్దీ ఉండే సమయాలలో పీక్ అవర్స్‌లో 56 రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. నాన్-పీక్ అవర్స్‌లో మియాపూర్ - ఎల్‌బీ నగర్ కారిడార్‌లో 4 నిమిషాలు, నాగోల్ రాయదుర్గ్ కారిడార్‌లో 5 నిమిషాల నిడివితో 44 రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మియాపూర్, - ఎల్‌బీ నగర్ కారిడార్‌లో 4 నిమిషాల గ్యాప్‌తో, నాగోల్ -, రాయదుర్గ్ కారిడార్‌లో 3 నిమిషాల గ్యాప్‌తో మెట్రో రైళ్లు నడిపిస్తోన్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు కలుగకుండా రాత్రి 11.00 గంటల తర్వాత కూడా చివరి మెట్రో రైలు సర్వీసును పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.