రాష్ట్రంలో ‘సర్’ పేరుతో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మనందరం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని కోరారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌజ్‌లో శుక్రవారం హజ్ యాత్రికుల బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, టిజిఎంఆర్‌ఇఐఎస్ ప్రెసిడెంట్ ఫహీముద్దీన్ ఖురేషి, హజ్ కమిటీ చైర్మన్ గులామ్ అఫ్జల్ బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, టిజిఎంఎఫ్‌సి చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిల్ హమద్, తదితరులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హౌజ్ హౌస్ వద్ద హజ్ యాత్రికుల బస్సులను జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయని అన్నారు. దీంతో హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. అలాగే సంక్షేమంలో మైనారిటీల వాటాను వారికి అందిస్తున్నామని తెలిపారు. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు స్కాలర్షిప్ లు అందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల్లో మైనారిటీలకు దక్కాల్సిన వాటాను వారికి అందిస్తున్నామని అన్నారు. గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, ప్రతీ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుందని గుర్తు చేశారు.