న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను ఏకంగా 15 శాతం పెంచింది. ఈ నిర్ణయం తక్షణం ఈ రోజు (13వ తేదీ) నుంచే అమలులోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం క్రమేపీ మన దేశపు ఆర్థిక స్థితిపై చూపుతున్న ప్రభావం, సంక్షోభ దశకు చేరకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి చమురు , వంటగ్యాసు సరఫరాల గొలుసుకట్టు క్రమానికి విఘాతం ఏర్పడటంతో వీటి కొనుగోళ్ల రేటు ఆకాశం అంటింది. ఈ పరిస్థితితో మన విదేశీ మారక ద్రవ్యం నిల్వల పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. ఫారెక్స్ రిజర్వ్‌పై పెరిగిన ఒత్తిడి నివారణకు తక్షణ రీతిలో బంగారం వెండి దిగుమతి సుంకాలను పెంచినట్లు నిర్థారణ అయింది. నిత్యావసరం కాని వాటి దిగుమతులను నియంత్రించే చర్యల్లో భాగంగా నిర్థిష్ట ఆర్థిక సూత్రాలకు అనగుణంగా ఇప్పుడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇంతకు ముందు బంగారం వెండిపై దిగుమతి సుంకాలు 6 శాతం వరకూ ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిని 15 శాతం పెంచారు. దీనితో బహిరంగ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి. బంగారంతో ముడివడి ఉన్న భారతీయుల సెంటిమెంట్‌పై ఈ చర్య విపరీత ప్రభావం చూపుతుంది. ప్రధాని మోడీ ఇటీవలే దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని కోరారు. వీలైతే ఏడాది పాటు బంగారు నగలు కొనకుండా ఉంటే మంచిదని పిలుపు నిచ్చారు. ఇప్పుడు కార్యాచరణకు దిగిన దాఖలాలలో దిగుమతి సుంకాలు పెరిగాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరుగుతున్న క్రమంలో ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు భారీగా పొదుపు చర్యలు చేపట్టాలని కూడా ప్రధాని పిలుపు నిచ్చారు . బంగారం వెండితో పాటు దేశంలో ప్లాటినియంపై కూడా దిగుమతి సుంకం పెంచారు. ఇంతకు ముందు ఉన్న 6.4 శాతం నుంచి దీనిని ఇప్పుడు 15.4 శాతానికి పెంచారు. ఇక బంగారం , వెండి కడ్డీల ధరలు, నాణేల ధరలను , సంబంధిత తాపడం ధరలను తదనుగుణంగా పెంచారు.

దిగుమతి సుంకం దాదాపు రెండింతలు

బంగారం వెండిపై ఇప్పుడు పెంపుదల స్థాయి ఇంతకు ముందటితో పోలిస్తే రెండింతలు అయింది. చైనా తరువాత భారతదేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బంగారం వినియోగ దేశంగా నిలిచింది. బంగారం దిగుమతిపైనే దేశంలోని అత్యంత విలువైన జ్యువెలరీ మార్కెట్ సాగుతుంది. అయితే ఈ భారీ స్థాయి దిగుమతితోనే తెరవెనుక అత్యధిక స్థాయిలో విదేవీ మారక ద్రవ్య వినిమయం జరుగుతుంది. దీని ప్రభావం రూపాయి విలువపై ఎక్కువగా పడుతుంది. దిగుమతులు పరిమితి దాటి విచక్షణారహితం అయితే మొత్తం మీద దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితి సుస్థిరతపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు తీసుకునే దిగుమతి సుంకాల పెంపుదల చర్యతో దిగుమతులు పరిమితి దాటకుండా ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. దీనితో దేశ అత్యంత కీలక ఆర్థిక వ్యవస్థ అన్ని స్థాయిల్లో ప్రభావితం కాకుండా ఉంటుందని అంచనా వేశారు. దిగుమతి సుంకాల పెంపుదల చర్య సహేతుకమే అని, ఇంతకు ముందు కూడా దేశంలో ఆర్థిక విపత్కర పరిస్థితుల నుంచి గట్టేక్కెందుకు బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు, దిగుమతి సుంకాల పెంపుదల చర్యలు చేపట్టారు.

ఇక దేశంలో బంగారం ధర కొండెక్కుడే

బంగారం పదిగ్రాములు రూ 1,62,000+

పది గ్రాముల బంగారానికి ఇకపై రూ 27000 వరకూ పెరుగుతుందని అఖిలభారత వజ్రాలు నగల మండలి (జిజెసి) ఛైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. ఇంతకు ముందు పెంపుదల రూ 13500గా ఉండేది. ఈ పెరుగుదలతో ఇప్పుడు ఈ రోజు నుంచి మార్కెట్‌లో బంగారం పది గ్రాములు ధర 24 క్యారెట్ బంగారానికి రూ 1,62000 అవుతుంది. ఇంతకు ముందు ఇది రూ 1,51,000గా ఉంది. వెండి ధర కిలోకు దాదాపు రూ 3 లక్షల స్థాయికి చేరుకొంటోంది. ఇక నగరాలు, మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఈ రేటులో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పటి ధరల పెరుగుదల ప్రభావంతో దేశంలో బ్లాక్ మార్కెట్ విస్తరించే ప్రమాదం ఉంది. పైగా స్మగ్లింగ్‌కు అవకాశం ఉంటుందని రోక్డే హెచ్చరించారు. పైగా దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతర ఆర్థిక వ్యవస్థ తలెత్తే ముప్పు కూడా ఉంటుందని విశ్లేషించారు. * పశ్చిమాసియా సంక్షోభం సమసిపోయే వరకూ దిగుమతి సుంకం భారీగా ఉంటుందని జువెలరీ వ్యాపారి , సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండి , సిఇఒ సువంకర్ సేన్ తెలిపారు. ఏడాది పాటు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.

జాగ్రత్త చర్యనే భయాలు వద్దుః అధికార వర్గాలు

ఇప్పుడు దిగుమతి సుంకాల పెంపుదల కేవలం ముందస్తు జాగ్రత్త చర్యనే అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అసాధారణ, బాహ్య పరిస్థితులతో ఈ పరిస్థితి తప్పదని పేర్కొన్నారు. నిర్ణీత చర్యలు తీసుకుని ఇకపై భారీ స్థాయి ముప్పు తలెత్తకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అనవసర దిగుమతులకు కళ్లెం వేసేందుకు ఇటువంటి చర్యలు తప్పవని తెలిపారు. గల్ఫ్ యుద్ధం, హర్మూజ్ దిగ్బంధంతో దేశ దిగుమతుల బిల్లు తడిసిమోపెడు అవుతోంది. ఈ క్రమంలో దేశంలోకి అత్యవసరంగా ముడి చమురు , ఎరువులు పారిశ్రామిక ముడి పదార్థాల రప్పింతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆహార భద్రతకు, క్యాపిటల్ గూడ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు దోహదం చేసినట్లు అవుతుంది. అనేక కారణాలతో దేశంలో 2025 26 ఆర్ఖిక సంవత్సరంలో బంగారం వెండి దిగుమతులు ఇంతకు ముందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 26.7 శాతం పెరిగాయి. దీని విలువ 102.5 బిలియన్ డాలర్లుగా నిలిచింది, ఇది మొత్తం దిగుమతులతో 14 శాతం వరకూ ఇంటుంది.గత ఆర్థిక సంవత్సరం ఇది 11.8 శాతంగా ఉండేది. డాలర్‌తో పోలిస్తే తాజాగా రూపాయి విలువ ఇప్పుడు అత్యంత అల్పస్థాయిలో 95.71 కి పడిపోయింది.

హర్మూజ్ నిలిపివేతతో ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ బ్రెంట్ ధరలు ఫిబ్రవరితో పోలిస్తే ఏకంగా బ్యారెల్‌కు 126 డాలర్ల స్థాయికి చేరాయి. హర్మూజ్ రాకపోకలు యధాతథ స్థితికి చేరినా పూర్తి స్థాయిలో చమురు రవాణాకు సమయం పడుతుంది. అప్పటివరకూ దేశంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతింటూ , ఇప్పుడు చేపట్టిన బంగారం నియంత్రణ చర్యలు కొనసాగించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పెరిగిన చార్జి ప్రభావం మార్కెట్‌పై రాబోయే రోజుల్లో సుంకాల బిల్లులు వాస్తవిక రూపానికి వచ్చే క్రమంలో మరింతగా కనబడుతుందని స్థానిక బంగారం,వెండినగల వ్యాపారులు తెలిపారు. దిగుమతి సుంకాల పెంపు ప్రభావం వల్ల వెంటనే దిగుమతులపై పెద్దగా పడబోదని, అయితే దేశీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతాయని నిపుణులు విశ్లేషించారు. అయినప్పటికీ బంగారం, వెండి అమ్మకాలు తగ్గుముఖం పడుతాయి కానీ , మరీ అమ్మకాలు పడిపోవని నగల వ్యాపారులు తేల్చిచెప్పారు. ప్రజల నమ్మకానికి బంగారం అనుసందానం అయింది. బంగారం తమ వద్ద ఉంటే ఎంతో ఆర్థిక విలువ , ఢోకా లేని పెట్టుబడి చర్య అనే వైఖరి ఉండటంతో భారీ స్థాయి ధరలతో నిమిత్తం లేకుండా బంగారం వెండి కొనే స్థాయి జనం కొంటూనే ఉంటారని , అయితే ఈ శాతంలో కొంత క్షీణత తప్పదని విశ్లేషించారు.

బంగారం దిగుమతి సుంకాల హెచ్చింపు తరువాత క్షణాల్లోనే దేశంలోని పలు నగరాల మార్కెట్లలో బంగారం , వెండి ధరలు పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే పది గ్రాముల బంగారంపై రూ 8550 వరకూ ధర పెరిగింది. దీనితో ఢిల్లీలో ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ 1.65 లక్ష అయింది. ఇక వెండి ధర కిలోకు రూ 20,500 దాకా పెరిగింది. దీనితో మార్కెట్‌లో ఇప్పుడు ఈ వెండి ధర కిలోకు 2,97,500 అయింది. ఇంతకు ముందు ఇది రూ 2,77,000 ఉండేది.