మన తెలంగాణ/హైదరాబాద్: శంకర్‌పల్లి సమీపంలో జరిగిన క్రేన్ ప్రమాదంలో గాయపడిన వారిని కార్మిక, గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు.

అధికారుల వివరాల ప్రకారం, ఎన్‌సిసి లిమిటెడ్ సంస్థకు చెందిన నిర్మాణ క్రేన్ బలమైన గాలుల కారణంగా ఒక షెడ్‌పై కూలిపోయింది. ఆ సమయంలో వర్షం నుంచి రక్షణ కోసం షెడ్‌లో నిలబడి ఉన్న కార్మికులపై క్రేన్ పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మందికి ఎముకలు విరిగే గాయాలయ్యాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంఎల్‌ఎ కాలె యాదయ్య తో కలిసి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.