
సురక్షిత ప్రాంతానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి తరలింపు
కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్
నిందితుడు అలెన్‌గా గుర్తింపు
శ్వేతసౌధం కరస్పాండెంట్ల వార్షిక విందులో ఘటన
టేబుళ్లు, కుర్చీల కింద నక్కిన అతిథులు, నేతలు, జర్నలిస్టులు
భయంతో విఐపిల పరుగులు
నేను భయపడే రకంకాదు.. ఈ పదవి ముప్పుతో కూడుకున్నదని తెలుసు
డొనాల్ట్ ట్రంప్ ప్రకటన, మళ్లీ విందు నిర్వహిస్తామని వెల్లడి
ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు: ప్రధాని మోడీ
ట్రంప్‌కు బాసట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, కీలక మంత్రులు, ఉన్నతాధికారులకు పెను ముప్పు తప్పింది. ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు కార్యక్రమంలో సాయుధుడు కా ల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన కాసేపు కలకలం సృష్టించింది. హోటల్ బాల్‌రూమ్ బయట ఓ వ్యక్తి పలు ఆయుధాలతో చొరబడి తుపాకీతో కాల్పులు జరపడంతో అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఇతర ప్ర ముఖులను భద్రతా సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనలో ఎవరికీ గా యాలు కాలేదని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.34 గంటల సమయంలో విందు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ సమయంలో ట్రంప్, వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వెయిజియా జియాంగ్, మెంటలిస్ట్ ఓజ్ పెర్ల్‌మన్‌లతో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమం వాషింగ్టన్‌లో ని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించారు. కాల్పుల శబ్దాలు వినిపించగానే సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ద్వితీయ మహిళ ఉషా వాన్స్‌లను భద్రతా వలయంలో తీసుకుని బాల్‌రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ట్రంప్‌ను తరలిస్తుండగా ఆయన కిందపడ్డ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కార్యక్రమానికి హాజరైన పలువురు అతిథులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ టోమస్ అలెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు లాస్‌ఏంజెలెస్ నుంచి చికాగోకు వచ్చాడని, అక్కడి నుంచి వాషింగ్టన్ చేరుకున్నట్లు గుర్తించారు.
నేను భయపడే రకం కాదు: ట్రంప్
తరువాత ట్రూత్ సోషల్ వేదికగా, హిల్టన్ హోటల్‌లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఈ విందు ను వచ్చే 30 రోజుల్లో మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఘటన అనంతరం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, కాల్పులకు పాల్పడిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఆ వ్యక్తి కాలిఫోర్నియాకు చెందినవాడని చెప్పారు. మొదట అది ఏదో ట్రే పడిన శబ్దమేమో అనుకున్నాను. కానీ శబ్దం చాలా పెద్దగా వినిపించింది. దాడి చేసిన వ్యక్తి కార్యక్రమ స్థలానికి చేరుకోలేదు అని ట్రంప్ పేర్కొన్నారు. అతడిని నిజంగానే అదుపులోకి తీసుకున్నారు అని ఘటనను గుర్తుచేసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ మీడియాతో అన్నారు.
ఒక భద్రతా అధికారి మీద కాల్పులు జరిగాయని, అయితే ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పిందని ట్రంప్ వెల్లడించారు. తాను భయపడుతూ బతికే వ్యక్తిని కాదన్నాడు. విదేశాంగ మంత్రి రూబియో, రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ ఈ పదవిలో ఉంటే ముప్పులను గురించి ముందే చెప్పారన్నారు. కాల్పుల ఘటన తర్వాత తాను హోటల్‌లోనే ఉండి డిన్నర్ కొనసాగిస్తానని పట్టుబట్టానని, అందుకోసం భద్రతా సిబ్బందితో తాను పోరాడినట్లు తెలిపారు. కానీ సీక్రెట్ సర్వీస్ ప్రదేశాన్ని వీడడమే మంచిదని సలహా ఇచ్చారని ట్రంప్ వివరించారు.
శనివారం జరిగిన ఈ ఘటన తనపై ఎలాంటి ప్రభావం చూపిందన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, అమెరికా అధ్యక్ష పదవి ప్రమాదకరమైనదేనని, అయినప్పటికీ తాను భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. దాని గురించి ఎక్కువగా ఆలోచించను. ఇది ప్రమాదకరమైన జీవితం. అయినా నేను సాధారణ జీవితమే గడపడానికి ప్రయత్నిస్తాను అని పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, స్వతంత్ర నాయకులు, కన్జర్వేటివ్‌లు, లిబరల్స్, ప్రోగ్రెసివ్‌లు అందరూ ఉన్నారు. రికార్డు స్థాయిలో జనసందోహం కనిపించింది అని ట్రంప్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికన్లు అందరూ శాంతియుత మార్గంలో విభేదాలను పరిష్కరించుకునేందుకు కట్టుబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనపై వివిధ పార్టీలకు చెందిన నేతలు స్పందిస్తూ, రాజకీయ హింసకు అమెరికాలో స్థానం లేదని స్పష్టం చేశారు.
ట్రంప్‌కు తీవ్ర విమర్శకురాలిగా పేరుగాంచిన సీనియర్ డెమోక్రాట్ నేత న్యాన్సీ పెలోసీ మాట్లాడుతూ, అధ్యక్షుడు, ప్రథమ మహిళతో పాటు కార్యక్రమానికి హాజరైన వారందరూ సురక్షితంగా ఉండటం ఊరటనిచ్చిందన్నారు. ఘటన సమయంలో వేగంగా స్పందించి భద్రత కల్పించిన సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు. డెమోక్రాట్ నేత రో ఖన్నా మాట్లాడుతూ, రాజకీయ హింస పూర్తిగా అంగీకరించలేనిది. మా దేశంలో దానికి ఎలాంటి స్థానం లేదు అని ఆయన అన్నారు.
అమెరికా ప్రతినిధుల సభ మెజారిటీ నాయకుడు స్టీవ్ స్కాలిస్ స్పందిస్తూ, వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ విందుకు హాజరైన వారిని రక్షించేందుకు వేగంగా స్పందించిన భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజలను ఒక్కచోటికి తీసుకువచ్చే కార్యక్రమం. హింసకు మా దేశంలో ఎలాంటి స్థానం లేదు అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రపంచ నాయకులు కూడా స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా అతిథులందరూ సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ సహా పలు దేశాధినేతల స్పందన..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ, వాషింగ్టన్ డీసీలో జరిగిన భద్రతా ఘటనలో ట్రంప్, మెలానియా ట్రంప్, జేడీ వాన్స్‌లు సురక్షితంగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖండించాలి అని మోదీ పేర్కొన్నారు. ట్రంప్, వాన్స్ క్షేమంగా బయటపడ్డారని తెలిసిన తర్వాత తనకు ఊరట కలిగిందన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ఘటనను ఆందోళనకర సంఘటనగా అభివర్ణించారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ రాజకీయ హింసకు స్థానం లేదు.
ఈ ఘటనతో కలత చెందిన వారందరిలో నేను కూడా ఉన్నాను అని ఆయన తెలిపారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ కూడా స్పందిస్తూ, వారందరికీ మా గౌరవాన్ని తెలియజేస్తున్నాం. హింస ఎప్పటికీ మార్గం కాకూడదు అని అన్నారు.గత రెండేళ్లలో డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. మొదటిది 2024 జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చోటుచేసుకోగా, రెండోది 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో జరిగింది.












