రమణ జీవి కవిత్వం వచన కవితా రంగంలో ఒక విలక్షణమైన ముద్రను కలిగి ఉంది. తాత్వికత, అంతర్మథనమే మూలస్తంభాలుగా సాగే ఆయన రచనల్లో వాస్తవానికి, ఊహకు మధ్య సరిహద్దులు చెరిగిపోయి అధివాస్తవికత తొంగిచూస్తుం ది. సాధారణ తర్కానికి అందని చిత్రణలతో జీవితం, మరణం, కాలం పట్ల ఆయనకు ఒక ప్రత్యేక దృష్టి ఉంది. తనను తాను సగం మౌనంగా, సగం వాక్యంగా భావిం చే రమణ జీవి, సామాజిక అంశాల నుండి వ్యక్తిగత అనుభూతుల వరకు కవిత్వ వస్తువును విస్తరించారు. ఆయన పద చిత్రాల్లో మనుషులకే కాక ప్రకృతిలోని ప్రతి చిన్న జీవికి చోటు ఉంటుంది. సాధారణ విషయాలను అసాధారణ ప్రతీకలతో చెప్పడం ఆయన శైలి. ‘పూర్తవడం’ కవితలో మనిషిలోని ద్వంద్వ స్వభావాన్ని, పరిపూర్ణత కోసం సాగే అన్వేషణను ఆవిష్కరించారు. మౌనానికి, మాటకు మధ్య ఉండే సందిగ్ధతను పక్షి కలలోని నిద్రతో పోల్చడం ఇందులో విశేషం.

గమ్యం కంటే పయన మే ముఖ్యమని, అసంపూర్ణతలను అంగీకరించి కలుపుకున్నప్పు డే జీవితం నిజంగా పూర్తవుతుందని ఆయ న తాత్వికార్థాన్ని పలికించారు.రమణ జీవి రాసిన ‘ఇల్లు వూడవడానికి ముందు’ కవిత దైనందిన పనుల వెను క దాగి ఉండే అతీతమైన తా త్వికతను ఆవిష్కరిస్తుంది. మరణం తర్వాత వచ్చే ఉదయా న్ని ఊహిస్తూ, శ్రమకు చిహ్నమైన చెమటను ఆరేయడానికి పర్వతాల మధ్య దండెము వెతకడం, గడిచిన రాత్రిని మడతపెట్టి సూర్యు ణ్ణి గదిలో వేలాడదీయడం వంటి ఊహలు ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. మరణాన్ని భయంగా కాక, ఒక ఇంటి పనిలా లేదా ప్రయాణంలా చూడటం ఆయన ప్ర త్యేకత. జ్ఞాపకాలు గాయపరచకుండా కళ్లద్దాలు’ ధరించాలనడం, ఏ కోరికలూ లేని శూన్య స్థితిలో పనిని ప్రారంభించాలని చెప్పడం ద్వారా ఒక రకమైన కర్మయోగాన్ని బోధించారు. ఈ కవిత భౌతికమైన శుభ్రత కంటే అంతరంగ ప్రక్షాళనకు, మానసిక సిద్ధతకు పట్టం కడుతుంది. నిత్య జీవితంలోని సామాన్య కృత్యాలకు ఆయన అసాధారణమైన జీవన తాత్వికతను అద్దారు.

‘మేకింగ్ ఆఫ్ ఎ పొయెమ్’ కవితలో కవిత్వ సృష్టిలోని అంతర్లీన వేదనను, ఆత్మాశ్రయ సంఘర్షణను రమణ జీవి అద్భుతంగా చిత్రించారు. కవిత్వం అనేది బలవంతంగా వచ్చేది కాదని, అది పక్వానికి వచ్చే వరకు వేచి ఉండాలని ఆయన నమ్ముతారు. కవిని ‘సముద్ర కూలీ’గా అభివర్ణించడం ద్వారా, అనంతమైన భావాలను మోయడంలో ఉండే కష్టాన్ని తెలియజేశారు. ‘ఎన్నిటినో చెరిపేశాక కాసిన్ని పదాలు మిగులుతాయి ‘అనడంలో కవిత్వ నిర్మాణంలోని వడపోత ప్రక్రియ కనిపిస్తుంది. కవిత రావ డం కంటే ఆ సృజనాత్మక ప్రక్రియలో గడిపిన క్షణాలే వి లువైనవని, కవి స్వయంగా కవిత్వంగా మారిపోవడమే పరమార్థమని ఆయన భావన. సముద్రం, పక్షులు, నెత్తు టి ముద్రలు వంటి ప్రతీకల ద్వారా సృజనకారుడి ఆత్మకథను ఈ కవితలో మనం చూడవచ్చు.

అలాగే ‘ఎండబెట్టు’ కవితలో తన అస్తిత్వాన్ని ప్రకృతిలోని ప్రతి అణువులోనూ దర్శిస్తూ, పర్వతాలకు పనులు పురమాయించడం వంటి ఊహలతో ప్రకృతి పట్ల ప్రేమను చా టారు. ‘బైపాస్’ కవితలో శస్త్రచికిత్సను కేవలం వైద్య ప్రక్రియగా కాకుండా, లోతైన ఆత్మశోధనగా మలిచారు. తనలోకి ప్రవేశించిన కత్తులను, పువ్వులను మౌనంతో కడగ డం ద్వారా కాలాన్ని వికసింపజేయవచ్చని ఆయన ఆవిష్కరించారు. రమణ జీవి కవిత్వంలో అధివాస్తవికత, అ మూర్త భావనలు ఒక్కోసారి సామాన్య పాఠకులకు క్లిష్టం గా అనిపించినా, అవి మేధస్సుకు పదును పెడతాయి. వ్య క్తిగత అంతర్మథనానికి, మృత్యువుకు, ప్రకృతికి ఆయన కవిత్వంలో పెద్ద పీట వేశారు. తన సొంత లోకంలో లీనమైపోయే ఆయన స్వభావం, మనిషి అంతరంగం లోతు ల్ని అన్వేషించేలా చేస్తుంది. సామాన్య సంఘటనల వెను క ఉన్న అసామాన్య సత్యాలను ఆవిష్కరించడమే రమణ జీవి కవిత్వ మార్గం.

- డాక్టర్ సుంకర గోపాలయ్య