కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే సంబురాల రాంబాబులను లోపలేస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన సొంత బ్రాండ్ కోసమే కెసిఆర్ కాళేశ్వరం కట్టారని తెలంగాణ సొమ్మును నాశనం చేశారని ఆయన ఆరోపించారు. బ్రాండ్ కోసమే కెసిఆర్ తట్టెడు అబద్ధాలు, పిట్ట కథలు చెప్పారని ఆయన మండిపడ్డారు. రెండు సంవత్సరాలకే కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందని ఎంపి ప్రశ్నించారు. ‘24 గంటల్లో సినిమా చూపిస్తామన్న బిజెపి ఎక్కడికి పోయిందని, సిబిఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని,

బిజెపి నాయకులు వెంటనే సిబిఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మానిపోయిన గాయానికి మళ్లీ మందు పెట్టేందుకు కెసిఆర్ బయటకు వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. కెటిఆర్, హరీశ్‌రావులు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పుపై బిఆర్‌ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నార న్నారు. కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎంపి తెలిపారు. కాళేశ్వరంలో దోపిడీ చేసిన వాళ్లను వదిలి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కూలిపోయిందన్నారు. నాణ్యత పాటించకుండా ప్రాజెక్ట్ కట్టి కూలిపోగానే కాంగ్రెస్‌పై కేసులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.