
ప్రజా పాలనకు రెండు చక్రాలు మానవ సమాజ నిర్మాణంలో ప్రభుత్వం ఒక వ్యవస్థ అయితే, ఆ వ్యవస్థకు ప్రాణం పోసేది ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ. పాలనను రూపకల్పన చేయడం ప్రభుత్వ బాధ్యత అయితే, ఆ పాలనను ప్రజల గడపదాకా తీసుకెళ్లి జీవన విధానంగా మార్చేది ఉద్యోగస్థులే. అందుకే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం కేవలం విధి నిర్వహణకే పరిమితం కాదు. అది పరస్పర విశ్వాసం, బాధ్యత, సహకారం, సామాజిక నిబద్ధతలతో కూడిన అవినాభావ బంధం. మే 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జెఎసి నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశం ఈ బంధానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. మనసా వాచా కర్మణా జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం, ఉద్యోగస్థులు తొలిసారిగా అంత స్వేచ్ఛగా, భావోద్వేగంతో, పరస్పర అవగాహనతో మాట్లాడుకోవడం విశేషం. పరిపాలనలో ఉద్యోగస్థుల పాత్ర, ప్రభుత్వ బాధ్యత, ప్రజాసంక్షేమం పట్ల ఇరువురి కర్తవ్యాలను ఎంతో స్పష్టంగా ఈ సమావేశం ఆవిష్కరించింది.
సిఎం తన భావోద్వేగ ప్రసంగంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగస్థులకు ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు అందేలా నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రత, వారి గౌరవం, వారి మానసిక ప్రశాంతత ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ఈ నిర్ణయం ద్వారా తెలియజేశారు. అనంతరం ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తోందని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఒక్క రూపాయి పెండింగ్ బిల్లు కూడా లేకుండా ఉన్న పరిస్థితి, గత పదేళ్లలో వేల కోట్ల రూపాయల బిల్లులు పేరుకుపోయిన దుస్థితి గురించి ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగస్థుల సమస్యలను పరిష్కరించే దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అదే విధంగా, ప్రభుత్వానికి మంచి పేరు రావడం మీ వల్లే అని ఉద్యోగస్థులను అభినందించడంద్వారా వారి సేవలకు గౌరవం తెలియజేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం కాగితాలపై ఉండకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో ఆయన గుర్తించారు. ప్రభుత్వం రూపొందించే ప్రతి సంక్షేమ పథకం వెనుక ఒక మహత్తర లక్ష్యం ఉంటుంది. సమాజంలోని చివరి వ్యక్తివరకు న్యాయం, అభివృద్ధి, భద్రత అందించడం. రైతు సంక్షేమ పథకాలు రైతుకు భరోసా ఇవ్వాలి, మహిళా సంక్షేమ పథకాలు కుటుంబాలను బలోపేతం చేయాలి. విద్య, వైద్య పథకాలు సామాన్యుడి జీవన ప్రమాణాలను పెంచాలి. అయితే ఈ లక్ష్యాలు కార్యరూపం దాల్చేది ప్రభుత్వ ఉద్యోగుల కృషి వల్లనే. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయాల వరకు ప్రతి ఉద్యోగి ప్రజా పాలనలో ఒక కీలక సేతువులా పనిచేస్తాడు. రెవెన్యూ, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, పోలీస్, వ్యవసాయం, విద్యుత్, మున్సిపల్, ట్రెజరీ, రవాణా వంటి ప్రతి శాఖ ప్రజల జీవితాలతో నేరుగా అనుసంధానమై ఉంటుంది.
ప్రభుత్వ విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం, అర్హులకు పథకాలను చేరవేయడం, ప్రజల సమస్యలను వినడం, సమయానికి పరిష్కరించడం వంటి బాధ్యతలను ఉద్యోగస్థులే నిర్వర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ఉద్యోగులు ఒకరిపై ఒకరు ఆధారపడే రెండు బలమైన స్తంభాలు. ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తే, ఉద్యోగ వ్యవస్థ దానికి కార్యరూపం ఇస్తుంది. అందుకే ఉద్యోగస్థులు కేవలం జీతభత్యాల కోసం పనిచేసే వర్గం కాదు; వారు ప్రజల ఆశలు, ప్రభుత్వ సంకల్పాలు, సమాజ అభివృద్ధిని కలిపే బాధ్యతాయుత వ్యవస్థ. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులతో సామరస్యంగా, సహనంతో వ్యవహరించాలని ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించడం కూడా పరిపక్వ పరిపాలనకు సంకేతం. పరస్పర గౌరవం, సహకారం ఉన్నచో సమర్థ పాలన సాధ్యమవుతుంది. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా, పరిపాలనలో సమన్వయం కొనసాగితేనే ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయి. ఉద్యోగస్థులకూ తమవైన బాధ్యతలు ఉన్నాయి.
ప్రజలతో మర్యాదగా మెలగడం, అవినీతి రహిత సేవలు అందించడం, ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెంచడం, సమయపాలన పాటించడం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం వంటి విలువలు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ ప్రతిష్టను నిలబెడతాయి. ప్రజల కష్టాల్లో ముందుండి సహాయం చేయడం, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికలు, అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమ సామాజిక బాధ్యతను చాటుతున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, సేవా భద్రత, ప్రమోషన్లు, పెన్షన్, వైద్య సదుపాయాలు, ఆర్థిక భరోసా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగి సంతోషంగా ఉంటేనే ప్రజా సేవ మరింత సమర్థవంతంగా సాగుతుంది. అందుకే ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య విశ్వాసపూర్వక వాతావరణం కొనసాగడం అత్యంత అవసరం. మొత్తానికి మే ఒకటిన జరిగిన ఈ సమావేశం కేవలం ఒక అధికారిక సమావేశం కాదు; అది ప్రభుత్వం, ఉద్యోగస్థుల మధ్య ఉన్న విశ్వాస బంధానికి, పరస్పర గౌరవానికి, బాధ్యతాయుత ప్రజాపాలనకు ఒక ప్రతీక. ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం, ఉద్యోగ వ్యవస్థ కలిసి నడిస్తే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే నమ్మకాన్ని ఈ సమావేశం బలపరిచింది. ప్రభుత్వ సంకల్పం, ఉద్యోగస్థుల కార్యదీక్ష, ప్రజల ఆశీర్వాదం కలిసినప్పుడే సుసంపన్నమైన రాష్ట్ర నిర్మాణం సాధ్యమవుతుంది.
- రమేష్ పాక
90009 13434














